గవర్నర్‌కు కేసీఆర్‌ మర్యాదలు… దేనికో?

Telangana-Governor-KCRతెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ని గత మూడేళ్ళుగా సిఎం కేసీఆర్‌ అవమానిస్తూనే ఉన్నారు. పాడి కౌశిక్ రెడ్డి అనే బిఆర్ఎస్ నేతని గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా నియమించాలంటూ కేసీఆర్‌ చేసిన సిరార్సుని ఆమె తిరస్కరించడమే కారణం.

ADVERTISEMENT

ఆమె పట్ల ప్రోటోకాల్ మర్యాదలు పాటించకుండా, తన మంత్రులు, ఎమ్మెల్యేల చేత ‘ఆమె బిజెపి ఏజంట్ అని, తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారంటూ’ విమర్శింపజేసేవారు. ఆగస్ట్ 15, గణతంత్ర దినోత్సవం, బడ్జెట్‌ సమావేశాలకు ముందు గవర్నర్‌ ప్రసంగం, సచివాలయం ప్రారంభోత్సవం వంటి అధికారిక కార్యక్రమాలకు కేసీఆర్‌ ఆమెను ఆహ్వానించేవారు కారు.

రాజ్‌భవన్‌లో జరిగే జెండా వందనం వంటి కార్యక్రమాలకు గవర్నర్‌ తమిళిసై స్వయంగా ఆహ్వానించినా కేసీఆర్‌, మంత్రులు హాజరయ్యేవారు కారు. ఆమె స్వయంగా ఈవిషయాలు మీడియాకు చెప్పుకొని బాధపడేవారు.

గవర్నర్‌ తమిళిసైతో ఇంత క్రూరంగా వ్యవహరిస్తున్న కేసీఆర్‌, శుక్రవారం ఆమెను సచివాలయానికి ఆహ్వానించారు. ఆమె కారు దిగగానే మంత్రులు, ఉన్నతాధికారులతో ఎదురేగి ఆమెకు సాధారంగా స్వాగతం పలికారు. సచివాలయ ఆవరణలో కొత్తగా నిర్మించిన ఆలయాలలో ఆమెకు ప్రాధాన్యం ఇచ్చారు.

అక్కడే కొత్తగా నిర్మించిన చర్చికి ఆమె చేతే రిబ్బన్ కట్ చేయించి ప్రారంభోత్సవం చేయించారు. ఆ తర్వాత క్రీస్టియన్ పెద్దల సమక్షంలో ఆమె చేత కేక్ కట్ చేయించారు. ఆ తర్వాత అక్కడే నిర్మించిన మసీదుకి కూడా తీసుకువెళ్లి చూపించి ముస్లిం పెద్దలందరినీ పరిచయం చేశారు. ఆ తర్వాత సచివాలయంలో తన ఛాంబర్‌తో సహా అంతా స్వయంగా తిప్పి చూపించారు. ఆమెకు సిఎస్ శాంతి కుమారి చేత బొట్టు పెట్టించి శాలువా కప్పి సత్కరించారు. ఆమె తిరిగి వెళుతుంటే కారు వరకు తోడ్కొని వచ్చి మర్యాదపూర్వకంగా రెండు చేతులు జోడించి నమస్కరించి వీడ్కోలు పలికారు.

గవర్నర్‌ పట్ల కేసీఆర్‌లో ఈ ఆకస్మికమార్పుని చూసి మంత్రులు, ఉన్నతాధికారులు, పార్టీ నేతలు అందరూ ఆశ్చర్యపోయారు. కానీ ఎవరూ ఈ మార్పు గురించి మాట్లాడలేదు.

బిఆర్ఎస్ నేతలు మాట్లాడకపోయినా ప్రతిపక్షాలు, మీడియా మాట్లాడకుండా ఉండవు. మాజీ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ, “నిన్నమొన్న వరకు గవర్నర్‌ తమిళిసైని కేసీఆర్‌ అవమానించని రోజు లేదు. కానీ ఇప్పుడు హటాత్తుగా ఆమెకు రాచమర్యాదలు ఎందుకు చేస్తున్నారంటే, గవర్నర్‌ ముందు తన ఆటలు సాగవని గ్రహించారు కనుకనే. ఆమె ఆమోదం లేకుండా కనీసం బడ్జెట్‌ సమావేశాలు కూడా నిర్వహించలేదు. శాసనసభ ఆమోదించిన పంపిన బిల్లులకు చట్టబద్దత రాదు. కనుక ఆమె వద్ద పెండింగులో ఉన్న బిల్లులకు ఆమోదముద్ర వేయించుకొనేందుకే కేసీఆర్‌ నిన్న ఈ కొత్త డ్రామా ఆడారు. కానీ ఆయన పని తీరగానే మళ్ళీ ఆమెను అవమానించకుండా ఉండరు,” అని అన్నారు.

కానీ అంతకు మించి మరేదో చాలా పెద్ద వ్యూహం ఉందని కాంగ్రెస్‌ నేతలు వాదిస్తున్నారు. ఇంతకాలం ఆమెపై కత్తులు దూసిన కేసీఆర్‌, మోడీతో ఏదో రహస్య అవగాహన కుదుర్చుకొన్నందునే ఆయన గవర్నర్‌కు రాచమర్యాదలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. శాసనసభ ఎన్నికలకు ముందు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ని మార్చేయడంతో ఈ రెండు పార్టీల మద్య తెర వెనుక ఏదో కధ మొదలైందని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. కేసీఆర్‌ ఏ పని చేసినా దాని వెనుక ఏదో బలమైన కారణం తప్పక ఉంటుంది. కనుక గవర్నర్‌ విషయంలో కేసీఆర్‌లో ఈ ఆకస్మిక మార్పుకి కారణం ఏమిటనేది రాబోయే రోజుల్లో మెల్లగా బయటపడవచ్చు.

ADVERTISEMENT
Latest Stories