జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన సినిమా షూటింగులతో బిజీ అయిపోవడంతో ఆంద్రాలో పర్యటించడం లేదు. కానీ వీలైనంత త్వరగా తన సినిమాలు పూర్తి చేసుకొని మార్చి నెలాఖరు లేదా ఏప్రిల్ మొదటివారం నుంచి వారాహిలో రాష్ట్ర పర్యటనలకి రావచ్చని తెలుస్తోంది. అప్పటి నుంచి వైసీపీ మంత్రులు మళ్ళీ టిడిపి, జనసేనల పొత్తుల గురించి మాట్లాడటం మొదలుపెట్టడం ఖాయం.
పవన్ కళ్యాణ్ టిడిపితో కలిసి పనిచేస్తామని స్పష్టంగా చెపుతుంటే, దమ్ముంటే 175 సీట్లలో పోటీ చేస్తామని ప్రకటించాలంటూ వైసీపీ నేతలు డిమాండ్ చేయడం దేనికంటే ఆయనని రెచ్చగొట్టి టిడిపికి దూరం చేసేందుకే! కానీ వైసీపీ నేతల ఉచ్చులో పవన్ కళ్యాణ్ పడకపోవడంతో టిడిపికి సొంతంగా పోటీ చేసే దమ్ములేకనే జనసేనతో పొత్తు పెట్టుకొంటోందని, కానీ సిఎం జగన్మోహన్ రెడ్డి ఒక్కడే సింగిల్‌గా సింహంలా వస్తున్నారంటూ వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకోవడం అందరూ వింటూనే ఉంటున్నారు. అంటే ఇటు నుంచి లేదా అటు నుంచి నరుక్కురావాలని వైసీపీ ప్రయత్నిస్తున్నట్లు అర్దమవుతోంది.
అయితే వైసీపీ నిజంగానే గత ఎన్నికలలో ఒంటరిగానే పోటీ చేసిందా?ఈసారి కూడా ఒంటరిగా పోటీ చేయబోతోందా?అంటే ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోలేదు కనుక అవుననే చెప్పుకోవాల్సి ఉంటుంది.
కానీ గత ఎన్నికలలో తెర వెనక నుంచి తెలంగాణ సిఎం కేసీఆర్, టిఆర్ఎస్ నేతలు వైసీపీని గెలిపించేందుకు సహాయసహకారాలు అందించగా, ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్, ఐ-ప్యాక్ బృందానికి వైసీపీ భారీగా డబ్బు చెల్లించడంతో అదీ ప్రత్యక్షంగా సహకరించిందనే సంగతి అందరికీ తెలుసు.
ఈసారి కూడా మళ్ళీ అదే జరుగబోతోంది. ఈసారి టిడిపికి విజయవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కేసీఆర్ బాగానే గుర్తించారు. అందుకే చేతికి ఎముక లేదన్నట్లు సంక్షేమ పధకాల పేరుతో ప్రజలకి డబ్బు పంచిపెడుతున్న ఏపీ కర్ణుడికి సాయపడేందుకు కేసీఆర్ కూడా కొత్త జెండా తగిలించుకొని వచ్చేస్తున్నారు కదా?అంటే బిఆర్ఎస్‌తో కూడా వైసీపీ రహస్య అవగాహన చేసుకొన్నట్లుగానే భావించవచ్చు. రెండు రాజకీయ పార్టీలైన టిడిపి, జనసేనలు బహిరంగంగా పొత్తులు పెట్టుకోవడం తప్పని వాదిస్తున్న వైసీపీ మరి చేస్తున్నదేమిటి?
గత ఎన్నికలకి ముందు ఏపీ ప్రజలకి ‘జగన్ రుచి’ తెలియదు కనుక ఒక్క ఛాన్స్ ఇచ్చి చూశారు. కానీ మూడున్నరేళ్ళు బాగా రుచి చూశారు కనుక ఈసారి రెండో ఛాన్స్ ఇవ్వకపోవచ్చు. కనుక ఈసారి ఎన్నికలలో వైసీపీకి ఐ-ప్యాక్ సేవలు ఇంకా చాలా అవసరం ఉంటుంది. అందుకే 175 సీట్లు గెలుచుకొంటామని చెపుతూనే, రాబోయే ఎన్నికలలో కూడా వైసీపీని గెలిపించే కాంట్రాక్ట్ ఐ-ప్యాక్ బృందానికి ఇచ్చింది. అంటే ‘ఐ-ప్యాక్‌తో వైసీపీ పొత్తులు’ పెట్టుకొందని అనుకోవచ్చు.
మరో విషయం ఏమిటంటే ఐ-ప్యాక్ బృందం టిడిపిని దెబ్బతీసేందుకు చేస్తున్న కుట్రలకే ఎన్నికల వ్యూహాలని అందమైన పేరు తగిలించుకొని పనిచేస్తోంది. ఐ-ప్యాక్ వైసీపీ దగ్గర డబ్బు తీసుకొని పనిచేస్తోంది కనుక టిడిపిని దెబ్బ తీయాలని ప్రయత్నించడం సహజం. కానీ అదే ఐ-ప్యాక్ వైసీపీ నేతలని కూడా దెబ్బ తీస్తుండటమే విచిత్రం!
వైసీపీ ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందో, రాబోయే ఎన్నికలలో ఎవరెవరికి టికెట్లు ఇవ్వాలో, ఎవరెవరిని పక్కనపెట్టాలో ఐ-ప్యాక్ చెపుతుంటుంది. అంటే వైసీపీ ఎమ్మెల్యేల రాజకీయ భవిష్యత్ వారి పార్టీ లేదా అధినేత చేతిలో కాక ఐ-ప్యాక్ చేతిలో ఉందన్నమాట! అంటే వైసీపీకి మిత్రుడు, శత్రువు రెండూ కూడా ఐ-ప్యాక్ అన్నమాట!



