
తెలంగాణలో కేసీఆర్, ఇక్కడ ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ సంక్రాంతి పండుగ తర్వాత ప్రజల మద్యకు వచ్చి ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిని దడదడలాడించేస్తారని వారి పార్టీల నేతలు చెప్పుకున్నారు.
ముఖ్యమంత్రులను దడదడలాడించేయడానికి వారు స్వయంగా పెట్టుకున్న గడువు నేటితో ముగుస్తుంది. ఇంకా కనుమ, ముక్కనుమ పండుగలకు కక్కా, ముక్కా చప్పరించాల్సి ఉంటుంది కనుక అవి జీర్ణమయ్యే సరికి మరో వారం రోజులు పట్టినా, ఇద్దరూ ఈ నెలాఖరులోగా గృహ నిర్బందం నుంచి విడుదల కావలసి ఉంది.
Also Read – వైసీపీ డీఎన్ఏలోనే ఏదో లోపం… ఉందా?
ఇక్కడ చంద్రబాబు నాయుడు, అక్కడ రేవంత్ రెడ్డి ఇద్దరూ కూడా తాము వారిపట్ల కక్షపూరితంగా వ్యవహరించమని, శాసనసభ సమావేశాలకు వచ్చి రాష్ట్రానికి, ప్రజలకు సంబందించిన అంశాలపై చర్చాలలో పాల్గొని తమ అభిప్రాయాలు చెప్పాలని కోరుతున్నారు.
తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి మొన్న ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, “అధికార, ప్రతిపక్షాలు కలిస్తేనే ప్రభుత్వం. శాసనసభ అంటే అధికార, ప్రతిపక్షాలకు చెందిన మొత్తం 119 మంది ఎమ్మెల్యేలు. అందరూ శాసనసభ చర్చలలో పాల్గొని ప్రతీ అంశంపై చర్చించి రాష్ట్రానికి, ప్రజలకు ఆమోదయోగ్యమైన, మేలు చేసే నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే ప్రభుత్వానికి పరిపూర్ణత ఏర్పడుతుంది. కనుక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ తప్పకుండా శాసనసభ సమావేశాలకు హాజరయ్యి మా ప్రభుత్వంలో తప్పొప్పులు చెప్పాలి,” అని విజ్ఞప్తి చేశారు.
Also Read – జగన్…అబద్దాలు..కవలలా.?
ఇక్కడ జగన్, తన 10 మంది ఎమ్మెల్యేలను వెంటబెట్టుకొని శాసనసభ సమావేశాలకు రావాలని సిఎం చంద్రబాబు నాయుడు కూడా కోరుతున్నారు.
అయితే కేసీఆర్, జగన్ ఇద్దరికీ ‘ఇగో’ చాలా ఎక్కువ. తాము ఎంతగానో ద్వేషిస్తున్న చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానాలలో కూర్చొని ఉండగా తాము శాసనసభలో ప్రతిపక్ష బెంచీలలో కూర్చోడానికి నామోషీగా ఫీల్ అవుతుండవచ్చు.
Also Read – చంద్రబాబు చేయలేకపోయారు… జగన్ చేస్తున్నారు?
లేదా శాసనసభకు వస్తే చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి వారి మంత్రులు తమ ‘ఇగో’ దెబ్బ తినేవిదంగా అవహేళన చేస్తారనే భయం, ఆందోళన ఉండి ఉండవచ్చు. కనుక ఇద్దరూ శాసనసభకు రాకపోవచ్చు.
కానీ ఇద్దరూ ‘సంక్రాంతికి వస్తున్నాం’ అని చెప్పారు. వారిలో ఒకరు మాట తప్పరు మడమ తిప్పరు. మరొకరు ఇచ్చిన మాట కోసం తల నరుక్కోవడానికి కూడా వెనుకాడని మహా నాయకుడు.
కనుక చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలని దడదడలాడించేందుకైనా ఇద్దరూ తప్పక బయటకు రావాలని వారి సొంత పార్టీల నేతలతో పాటు టీడీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా వారి రాక కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. మరి వస్తారా?