తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మో, బొమ్మో ఇవ్వలేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమం ద్వారా పోరాడి తెలంగాణ తెచ్చుకున్నారని ఐటీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని బాధించినటున్నాయి. సోనియాగాంధీని ఉద్దేశించి కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారని, ఆయనను కేసీఆర్ కంట్రోల్‌లో పెట్టాలని కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. అయితే దానికి కేటీఆర్ వెనక్కు తగ్గలేదు.
ఈ నేపథ్యంలో కేటీఆర్ స్పందిస్తూ.. ‘ఉత్తమ్‌గారూ.. నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాను. 1952 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంతా తెలంగాణకు మోసాలు, ద్రోహలతో నిండి ఉంది. ప్రజా ఉద్యమానికి తలొగ్గి అనివార్య పరిస్థితుల్లోనే రాష్ట్రాన్ని ఇచ్చారు’ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
అయితే దీనికి కేటీఆర్ కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడిన ఒక పాత వీడియోతోనే కౌంటర్ ఇచ్చారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ‘సోనియాగాంధీ దయ వల్లనే తెలంగాణ వచ్చింది. ఇది ఎవరన్నా కాదంటే.. వారు మూర్ఖులే.. సోనియా వల్లే తెలంగాణ వచ్చింది. ఇందులో ఎవరికీ అనుమానాలు అవసరం లేదు’ అంటూ సదరు వీడియోని ట్యాగ్ చేస్తూ.. మీ నాన్న వ్యాఖ్యలతో విభేదిస్తున్నారా? అని పీసీసీ అధ్యక్షుడు ప్రశ్నించారు.



