2019 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు తన పంథా మార్చినట్టున్నారు. ఇప్పటిదాకా బీజేపీతో సఖ్యతతో వ్యవహరిస్తున్న తెరాస ఇప్పుడు ఆ పార్టీకి దూరంగా జరగాలని చూస్తుంది. మరోవైపు ముస్లింల ఓట్ల కోసం మజ్లీస్ కు దగ్గరగా జరగాలని చూస్తుంది.
ముస్లింలకు రిజర్వేషన్ల అంశం కేంద్రం పరిశీలనలో ఉందని, వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ముస్లింల రిజర్వేషన్లపై తెరాస ఎంపీలు పోరాటం చేస్తారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. ఇదే అంశంతో తెరాస బీజేపీని ఇరుకున పెట్టి మజ్లీస్ కూడా దగ్గరగా చేరబోతోంది.
అప్పుడే ఈ దోస్తీకి మజ్లీస్ సిగ్నల్ ఇచ్చింది కూడా. టిఆర్ఎస్ , ఎంఐఎం 2019 ఎన్నికల్లో కలిసి పనిచేసి అధికారంలోకి వస్తాయని అక్బరుద్దీన్ అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విపక్షాలు చిత్తుగా ఓడిపోయాయని గుర్తుచేశారు. 2019లోనూ అవే ఫలితాలు పునరావృతమవుతాయని అక్బర్ జోస్యం చెప్పారు .
నిండు సభలో ఈ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తోందని ఒవైసి మెచ్చుకున్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో మైనార్టీ గురుకులాలు ప్రారంభించారని అన్నారు. గత ప్రభుత్వ ఉపకార వేతన బకాయిలను కూడా తెరాస సర్కారు చెల్లించిందన్నారు. మరి ఈ పరిణామాలకు మోడీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి!



