kcr BRS party

సినీ పరిశ్రమకి దసరా-దీపావళి తర్వాత సంక్రాంతి అతి పెద్ద సీజన్‌. కనుక సంక్రాంతికి అనేక సినిమాలు విడుదలవుతుంటాయి. అయితే ఇప్పుడు మన చర్చ సంక్రాంతికి విడుదల కాబోతున్న సినిమాల గురించి కాదు.. గత 7-8 నెలలుగా ఫామ్‌హౌస్‌లో గృహ నిర్బంధంలో ఉండిపోయిన బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ గురించి.

ఆయన కూడా సంక్రాంతి తర్వాత మళ్ళీ రాజకీయాలలో చురుకుగా పాల్గొంటారని, సిఎం రేవంత్ రెడ్డిని కట్టడి చేసే మంత్రదండం చేత పట్టుకొని వస్తారని బిఆర్ఎస్ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. అంటే కేసీఆర్‌ కూడా ‘సంక్రాంతి రిలీజ్’ అని చెప్పుకోవచ్చు.

Also Read – వైసీపీ గొంతులో విశాఖ ఉక్కు దిగిందిగా!

కేసీఆర్‌, రేవంత్ రెడ్డిల రాజకీయాలను నిశితంగా పరిశీలించిన్నట్లయితే, కేసీఆర్‌ పక్కా ప్లాన్ చేసుకొని తన రాజకీయ ప్రత్యర్ధులను చావు దెబ్బ తీస్తుంటారు. తన వాక్చాతుర్యంతో నందిని పందని, పందిని నందని నమ్మించగల దిట్ట.

అపర చాణక్యుడైన కేసీఆర్‌ని కొట్టే మొగాడే తెలంగాణలో పుట్టలేదని ఆయనతో సహా బిఆర్ఎస్ పార్టీ నేతలందరూ గట్టిగా నమ్ముతున్నప్పుడు, రేవంత్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీని ఓడించి, కేసీఆర్‌ని ఫామ్‌హౌస్‌లో కూర్చోబెట్టారు! కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలందరినీ కూడా తన దారికి తెచ్చుకున్నారు.

Also Read – అదే వైసీపీ, బిఆర్ఎస్ నేతలకు శ్రీరామ రక్ష!

కనుక రేవంత్ రెడ్డిని తక్కువ అంచనా వేయడానికి లేదు. రేవంత్ రెడ్డి రాజకీయాలలో చాలా దూకుడుగా వ్యవహరిస్తుంటారు. ఆ పద్దతిలోనే కేసీఆర్‌ని ఓడగొట్టారు కూడా.

అయితే రేవంత్ రెడ్డికి రాజకీయాలు ఎలా చేయాలో తెలుసు కానీ పాలన విషయంలో కేసీఆర్‌తో పోటీ పడలేకపోతున్నట్లే కనిపిస్తోంది.

Also Read – ఆ రెండు పార్టీలకి గేమ్ చేంజర్‌ విశాఖపట్నమే!

ఓ పక్క కాంగ్రెస్‌ అధిష్టానం, మరోపక్క కేంద్ర ప్రభుత్వం ఒత్తిళ్ళు భరిస్తూ, బీజేపి, బిఆర్ఎస్ పార్టీల రాజకీయాలను ఎదుర్కొంటూ పాలన చేయాల్సివస్తోంది.

అందుకే అభివృద్ధి, పరిశ్రమలు, పెట్టుబడులు, ఎన్నికల హామీల అమలు తదితర అంశాలపై నుంచి ప్రజల దృష్టిని మళ్ళించేందుకు, కేసీఆర్‌, కేటీఆర్‌లపై కేసులు, విచారణలు, అరెస్టులు అంటూ హడావుడి చేస్తూ కాలక్షేపం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.




కనుక రేవంత్ రెడ్డి పాలన, రాష్ట్రాభివృద్ధి విషయంలో పట్టు సాధించలేకపోతే అదే ఆయన బలహీనతగా, కేసీఆర్‌కి మంత్ర దండంగా మారవచ్చు. కనుక వారిరువురి మద్య జరుగబోయే ఆధిపత్యపోరులో ఎవరు పైచేయి సాధిస్తారో తెలియాలంటే సంక్రాంతిక రిలీజ్ వరకు ఎదురుచూడాల్సిందే!