ఏ రంగంలోనైనా ఆశయాలు చాలా గొప్పగా ఉంటాయి. అవి గొప్పగా చెప్పుకునేందుకే తప్ప ఆచరణలో 25శాతం కూడా కనిపించవు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మద్య సంబంధాలు అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవడం కూడా అటువంటిదే. అన్ని రాష్ట్రాల అభివృద్ధికి లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నామంటూ కేంద్రం పద్దులు చూపుతుంటుంది. రాష్ట్రాల పట్ల కేంద్రం వివక్ష చూపిస్తోందని ప్రాంతీయ పార్టీలు ఆరోపిస్తూనే ఉంటాయి.
కేంద్రంతో సత్సంబంధాలుంటే లేదా ప్రాంతీయ పార్టీలతో కేంద్రానికి పొత్తులు, అవసరాలు ఉంటే ఉదారంగా నిధులు విడుదల చేస్తుంటుంది. కానీ కేంద్రంపై కత్తులు దూస్తూ నిధులు విడుదల చేయాలని కోరితే చేస్తుందా?అంటే చేయదు.
ఉదాహరణకు తెలంగాణలో మొదట కేసీఆర్ ప్రధాని మోడీపై కత్తులు దూసి రాష్ట్రానికి నష్టం కలిగించుకుంటే, తర్వాత వచ్చిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందినవారు కావడంతో, ఆయన కూడా ప్రధాని మోడీపై కత్తులు దూయక తప్పడం లేదు. కనుక నిధులు రావడం లేదు. కనుక పార్టీలు, వాటి రాజకీయాల కారణంగానే ఈ సమస్య ఏర్పడుతోందని చెప్పవచ్చు.
అయితే సిఎం రేవంత్ రెడ్డి ఓ పక్క కత్తులు దూస్తున్నా ప్రధాని మోడీ పట్ల విధేయంగా మెసులుకుంటూ నిధులు రాబట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎప్పటికైనా తెలంగాణలో బీజేపి అధికారంలోకి రావాలని మోడీ, అమిత్ షాలు కోరుకుంటున్నారు. కనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉదారంగా నిధులు అందిస్తూ కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వచ్చేందుకు సహకరిస్తారని ఆశించడం రాజకీయ అవివేకమే.
తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ బలహీన పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. తెలంగాణలో బీజేపి అధికారంలోకి వచ్చేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతోంది.
కనుక సిఎం రేవంత్ రెడ్డి ఎంత విధేయంగా ఉన్నా తెలంగాణకు నిధులు విడుదల చేసే అవకాశం లేదనే భావించవచ్చు.
ఏపీ విషయానికి వస్తే, ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు కీలకంగా ఉన్నప్పటికీ, అమరావతి, పోలవరం, మెట్రో వంటి అభివృద్ధి పనులకు కేంద్రం అప్పులు ఇప్పిస్తోంది తప్ప ఉదారంగా నిధులు విడుదల చేయడం లేదు. బహుశః ఫ్లాష్ బ్యాక్ ప్రభావం కావచ్చు. కానీ బిహార్ సిఎం నితీష్ కుమార్ బెదిరింపులకు పాల్పడుతూ కేంద్రం నుంచి భారీగా నిధులు రాబట్టుకుంటున్నారు.
ఈ రాజకీయాలకు అతీతంగా అన్ని రాష్ట్రాలకు కేంద్రం నిధులు విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ, రాజకీయాలను పక్కన పెట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకోవడం అసంభవమే. కనుక నిధులు, ప్రాజెక్టులు, సహాయ సహకారాలు కూడా తదనుగుణంగానే ఉంటున్నాయి. ఇది సరికాదని అందరికీ తెలుసు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈవిదంగానే ముందుకు సాగుతున్నాయి.




