ఇటీవలే జరిగిన శాసనసభ ఎన్నికలలోని ఘోర పరాజయం నుండి ప్రతిపక్ష పార్టీ ఇంకా కోలుకునట్టు లేదు. దీనితో రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమవుతున్నాయి. రాష్ట్రంలోని మొత్తం గ్రామ పంచాయతీల్లో మొదటి విడతగా 4,479 పంచాయతీలకు, 39,822 వార్డు సభ్యుల పదవులకు జనవరి 7న నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. వాటిలో 769 సర్పంచ్ పదవులు, 10,654 వార్డు సభ్యుల పదవులు ఏకగ్రీవమయ్యాయి. వీటిలో మెజారిటీ అధికార పక్షానికి కావడం విశేషం.
ఇటీవలే జరిగిన శాసనసభ ఎన్నికలలో అధికారంలోకి వస్తామని మహాకూటమి ఆశిస్తే కనీసం 20 సీట్లు కూడా రాకపోవడం విశేషం. తెరాస వేవ్ లో చాలా మంది కాంగ్రెస్ సీనియర్లు కూడా కొట్టుకుపోయారు. దీనితో పార్టీలో ఒకరకమైన నిరాశ ఆవహించింది. సరిగ్గా ఇదే అదను అని అధికార పార్టీ పంచాయితీ ఎన్నికలను తెచ్చి ప్రతిపక్షం సిద్ధం గా లేకపోవడాన్ని వాడుకుని ఈ ఎన్నికలలో భారీ విజయం సాధించే దిశగా పావులు కదిపింది. ఇప్పటివరకు జరిగిన ఏకగ్రీవాలు బట్టి తెరాస ఆ దిశగా సక్సెస్ అయినట్టే కనిపిస్తుంది.
మలి విడత ఎన్నికలలో ఇదే ప్రకారంగా ముందుకు పోయి ఎన్నికలలో గట్టిగా ప్రయత్నించి 90-95% పంచాయితీలు చేజిక్కించుకోవాలని ప్రభుత్వ వ్యూహం. పంచాయితీ ఎన్నికల తరువాత మునిసిపల్ ఎన్నికలు, సొసైటీ ఎన్నికలు కూడా వెంటవెంటనే జరిపించి రాష్ట్రంలో కింద నుండి పై వరకు తెరాసనే ఉండేలా పార్టీని బలోపేతం చెయ్యాలని కేసీఆర్ వ్యూహం. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇటీవలే నియమితులైన కేటీఆర్ కు దీని మీద స్పష్టమైన అవగాహన ఉన్నట్టు సమాచారం. ప్రతిపక్షాలు ఇప్పటికైనా మేలుకోకపోతే ఇబ్బందే.



