హైదరాబాద్ ను ఖాళీ చేసి అమరావతికి వెళ్లిపోయాక, ఇప్పుడు మళ్లీ పోలీస్ నిఘా విభాగాన్ని రాజధానిలోకి దింపి చంద్రబాబు తెలంగాణలో సర్వేలు చేయిస్తున్నారని కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నారు. అంతేకాక టిఆర్ఎస్ నుంచి కొందరిని ఆకర్షించడానికి కూడా చంద్రబాబు ఈ నిఘా సిబ్బందిని వాడుకుంటున్నారని, జిల్లాల నుంచి టిఆర్ఎస్ నేతలు ముఖ్యమంత్రికి తెలిపారు.
[m9ad]
తెలంగాణాలో తనకు ధీటైన నాయకుడెవరు ప్రతిపక్షంలో లేరు అనుకుంటున్న కేసీఆర్ ఉన్నఫళంగా చంద్రబాబు తెలంగాణ ఎన్నికలలో పావులు కదపడటం జీర్ణించుకోలేకపోతున్నారా? చంద్రబాబును అడ్డుకోవడానికి ఓటుకు నోటు కేసు తెరమీదకు తెచ్చినట్టు సమాచారం. అప్పట్లో స్టీఫెన్సన్ కు 50 లక్షలు ఇచ్చి మరో 4.5 కోట్లు ఇస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.
అయితే మిగిలిన 4.5 కోట్ల రూపాయలు ఎక్కడ నుంచి వచ్చాయి..ఎక్కడ ఉన్నాయో తేల్చాల్సిందిగా తెలంగాణకు చెందిన పోలీసు ఉన్నతాధికారులు ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ)తో పాటు కేంద్ర సంస్థలను కోరుతూ లేఖ రాసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తెలంగాణలో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా టీడీపీ,కాంగ్రెస్ లు జట్టుకట్టిన విషయం తెలిసిందే.
అలాగే చంద్రబాబు నిఘా అధికారులను హైదరాబాద్ లోకి దింపడంతో ఆయనను ఎదురుకోవడానికి కేసీఆర్ ఈ అస్త్రం ప్రయోగించారని తెలుగు దేశం నాయకులు అంటున్నారు. మొత్తానికి చంద్రబాబు కేసీఆర్ కు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నారని వారు అంటున్నారు. అయితే ఈ కేసుతో తమకు ఎలాంటి ఇబ్బంది ఉండదని వారు అంటున్నారు.



