పెద్ద నోట్ల రద్దు విషయంలో తొలినాళ్ళల్లో స్పందించిన తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్, ఈ నిర్ణయాన్ని తీవ్రంగా విభేదించిన విషయం తెలిసిందే. ఎవరినీ సంప్రదించకుండా తీసుకున్న నిర్ణయమని కేంద్ర ప్రభుత్వంపై మండిపడిన కేసీఆర్, ప్రజల కష్టాలను ప్రధానికి వివరిస్తానంటూ ఢిల్లీ పయనమై, మోడీని కలిసి వచ్చిన విషయం తెలిసిందే. అయితే మోడీతో మంతనాలు జరిపిన క్షణం నుండి కేసీఆర్ స్వరంలో పెనుమార్పు రావడం గమనించదగ్గ విషయం.
అంతకుముందు వరకు కేంద్ర ప్రభుత్వంపై మండిపడిన కేసీఆర్, ప్రస్తుతం మాత్రం కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ విమర్శలకు దిగారు. అసలు బ్లాక్ మనీని పెంచిపోషించింది కాంగ్రెస్ పార్టీ వారేనని, నల్లధనానికి సృష్టికర్తలు వారేనని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మరో వైపు నుండి మోడీ తీసుకున్న నిర్ణయాన్ని అతి పెద్ద సంస్కరణగా అభివర్ణిస్తూ… తప్పుగా అర్ధం చేసుకోవద్దంటూ పిలుపునిచ్చారు. అవినీతి రహిత ఇండియాగా మార్చే ప్రక్రియకు తెలంగాణా మద్దతు ఉంటుందని ప్రకటించారు.
అయితే కేసీఆర్ లో ఇంత మార్పు రావడానికి ప్రధాన కారణం… ప్రధాని మోడీతో చేసుకున్న “చీకటి ఒప్పందమేనని” కాంగ్రెస్ వర్గాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఢిల్లీ పయనం కాక ముందు వరకు ఒక రకంగా మాట్లాడిన కేసీఆర్, ప్రస్తుతం వేరే రకంగా మాట్లాడడం వెనుక ఉద్దేశం అదేనని చేస్తున్న ఆరోపణలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకునేలా చేస్తున్నాయి. మరి దీని వెనుక ఉన్న అసలు “మతలబు” ఏంటనేది ఆ దేవుడికే ఎరుక..!



