తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారా? అంటే అవుననే సమాధానం బిజెపి అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు నుండి వినిపిస్తోంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో బీజేపీ ఘన విజయం సాధించిన తర్వాత ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ ఆలోచిస్తున్నట్టుగా అభిప్రాయ పడుతున్నారు. 2017 చివరిలో కానీ, 2018 మొదట్లో కానీ ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని లాజిక్స్ ను బయట పెడుతున్నారు బిజెపి ప్రతినిధి.
ప్రస్తుతం ప్రతిపక్షాల్లో ఐక్యత లేకపోవడం, కాంగ్రెస్ బలహీనంగా ఉండడంతో కేసీఆర్ దానిని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నారని కృష్ణసాగర్ వివరించారు. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి మూడు కారణాలున్నాయని, ఒకటి… రాష్ట్రంలో మరో రెండేళ్లలో బీజేపీ బలపడుతుందనే భయం, రెండు… కాంగ్రెస్ చాలా బలహీనంగా ఉండడం, మూడవది… 2018లో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనుండడం, ఈ ప్రభావం శాసనసభ ఎన్నికలపై ప్రభావం చూపిస్తాయనే ఉద్దేశంతో, కేసీఆర్ ముందస్తు ఆలోచనకు కారణమని పేర్కొన్నారు.
అయితే టీఆర్ఎస్ సీనియర్ నేత, ఎంపీ బి.వినోద్ కుమార్ మాత్రం ఈ ఊహాగానాలను కొట్టిపడేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఆలోచన అసలేమీ లేదని, ఇవన్నీ రాజకీయ లబ్ది కోసం పొలిటికల్ వర్గాల్లో వినిపించేవేనని తేల్చేసారు. 2019 ఎన్నికల నాటికి ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు ఇస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, హామీ నెరవేర్చే వరకు ఎన్నికలకు వెళ్లబోరని, అయినా తెలంగాణాలో టీఆర్ఎస్ కు ఎదురుగా నిలిచే పార్టీ ఏది లేదని, ఇప్పుడే కాదు, 2019 నాటికి ప్రతిపక్షాలకు ఇంతకంటే దారుణమైన పరిస్థితిలో ఉంటాయని అన్నారు.



