తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.
ఈ సమావేశంలో సాగునీరు, నదీ జలాల పంపకాలు, వ్యవసాయం, రైతుల సమస్యలు వంటి అంశాలపై ప్రధానంగా మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. ఈ సమస్యలను పరిష్కరించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలపై ఆయన దృష్టి సారించనున్నారు.
ఈ అంశాలపై పార్టీ శ్రేణులకు స్పష్టమైన దిశానిర్దేశం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. భవిష్యత్ కార్యాచరణపై కూడా కీలక సూచనలు చేసే అవకాశముంది.
తెలంగాణ రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. కానీ దాదాపు రెండేళ్లుగా రాజకీయంగా పెద్దగా చురుకుగా లేకుండా ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారన్న విమర్శలు ఉన్నాయి.
ఇప్పటికైనా బయటకు వచ్చి ప్రజా సమస్యలపై పార్టీ నేతలతో చర్చించడం ఆహ్వానించదగ్గ పరిణామమే. కార్యాచరణ రూపొందించి, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేయడం అవసరమే.
బీఆర్ఎస్ పార్టీ స్థాపనకు 26 ఏళ్లు, తెలంగాణ ఏర్పడి 11 ఏళ్లు పూర్తయ్యాయి. అయినా ఇప్పటికీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని బూచిగా చూపిస్తూ ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే అది రాజకీయ బలహీనతగానే భావించాల్సి వస్తుంది.
పార్టీ పూర్వ వైభవం కోసం మరోసారి గట్టిగా పోరాడాలనుకోవడం తప్పు కాదు. సాగునీరు, వ్యవసాయం, నదీ జలాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వంతో పోరాటం చేస్తే ప్రజల్లోనూ ఆదరణ లభిస్తుంది.
కేసీఆర్ రాజకీయ వైఖరి ఈసారి ఏ విధంగా ఉంటుందో, సమస్యలకే పరిమితమవుతారో లేక మళ్లీ పాత రాజకీయ శైలికే వెళ్తారో సమావేశం ప్రారంభమైతే స్పష్టత రానుంది.




