Chandrababu-Naidu-KCRనల్గొండ జిల్లా మునుగోడు శాసనసభకు ఉపఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈసారి ఆ ఉపఎన్నికలలో టిడిపి పోటీ చేయాలనుకొంది. కానీ చివరి నిమిషంలో ఆ ఆలోచన విరమించుకొంది. ఈ ఉపఎన్నికలలో టిఆర్ఎస్‌, బిజెపిలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోరాడుతున్నందున టిడిపి పోటీ చేసినా నిరాశ తప్పదనే ఆలోచనతో వెనక్కు తగ్గింది.

అయితే చంద్రబాబు నాయుడు మళ్ళీ బిజెపితో దోస్తీ చేయాలనుకొంటున్నందునే దానికి మద్దతుగా వెనక్కుతగ్గారని టిఆర్ఎస్‌ అధికార పత్రిక నమస్తే తెలంగాణలో పేర్కొంది. కాంగ్రెస్ పార్టీలో తన నమ్మిన బంటు రేవంత్‌ రెడ్డిని కోవర్టుగా ప్రవేశపెట్టి ఆ పార్టీ పీక నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించింది.

ఏపీలో కొడిగడుతున్న టిడిపిని కాపాడుకోవడానికే చంద్రబాబు తెలంగాణలో బిజెపికి మద్దతు ఇచ్చేందుకు సిద్దమయ్యారని ఆరోపించింది. మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలిచే అవకాశం లేదని గ్రహించిన బిజెపి పెద్దలు తమ పార్టీలోని గరికపాటి మోహన్ రావుని చంద్రబాబు వద్దకు రాయబారం పంపించి మాట్లాడించారని, వెంటనే మునుగోడు బరిలో నుంచి టిడిపి తప్పుకొందని పేర్కొంది. మునుగోడులో బిజెపి ర్యాలీలో టిడిపి జండాలు కనిపిస్తుండటమే ఇందుకు నిదర్శనమని పేర్కొంది. స్వయంపాలనలో కళకళలాడుతున్న తెలంగాణ రాష్ట్రంలో విషం చిమ్మి రాష్ట్రంలోని ప్రశాంతమైన రాజకీయ వాతావరణాన్ని అల్లకల్లోలం చేసేందుకు చంద్రబాబు కాసుకు కూర్చోన్నారని నమస్తే తెలంగాణ ఆరోపించింది.

ఏపీలో టిడిపి, జనసేనలు పొత్తులు పెట్టుకోవాలనుకొంటే సిఎం జగన్మోహన్ రెడ్డికి భయం. ఆందోళన! తెలంగాణలో టిడిపి జెండా కనిపిస్తే సిఎం కేసీఆర్‌కు ఆందోళన!

వచ్చే ఎన్నికలలో 175 సీట్లు మావే అని గొప్పగా చెప్పుకొనే సిఎం జగన్‌కి టిడిపి ఏ పార్టీతో పొత్తులు పెట్టుకొంటే ఎందుకు? వాటిని చూసి ఆందోళన చెందవలసిన అవసరం ఏమిటి? తెలంగాణ టిడిపిని ఫిరాయింపులతో నిర్వీర్యం చేసిన కేసీఆర్‌ టిడిపి ఏ పార్టీతో పొత్తులు పెట్టుకొంటే ఎందుకు ఆందోళన చెందవలసిన అవసరం ఏమిటి?అనే ప్రశ్నలకు ఆ పార్టీల నేతలే సమాధానాలు చెప్పాలి.

టిడిపి ఓ రాజకీయ పార్టీ. రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఉంది. కనుక అది తన పార్టీ, రాష్ట్రం అవసరాల కోసం ఏ పార్టీతోనైనా పొత్తులు పెట్టుకోవచ్చు లేదా మద్దతు ఈయవచ్చు. కానీ అది మహానేరం అన్నట్లు వైసీపీ, టిఆర్ఎస్‌లు వాదిస్తున్నాయి.

రేవంత్‌ రెడ్డి ద్వారా చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ గొంతు పిసికేస్తున్నాడని నమస్తే తెలంగాణ ఆరోపణ. నిజానికి తెలంగాణ కాంగ్రెస్‌ గొంతు పిసికేసింది ఎవరు? కేసీఆరే కదా?అందుకు మూల్యం ఇప్పుడు చెల్లించుకొంటున్నారు కదా?

ఉద్యమకారుడైన కేసీఆర్‌ ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రంలో ప్రతిపక్షాలను ఫిరాయింపులతో నిర్వీర్యం చేస్తుంటే దానికి బంగారి తెలంగాణ అనే అందమైన ముసుగు వేసి చూపారు. కేసీఆర్‌ ప్రధాని నరేంద్రమోడీతో రాసుకుపూసుకు తిరుగుతూ కేంద్రానికి మద్దతు ఇచ్చినప్పుడు నమస్తే తెలంగాణకి అది తప్పుగా కనిపించలేదు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల మద్య బలమైన సంబంధాల కోసం అంటూ సమర్ధించింది.

ఇప్పుడు బిఆర్ఎస్‌తో జాతీయ రాజకీయాలలో ప్రవేశించాలనుకొంటున్న కేసీఆర్‌ వివిద రాష్ట్రాలకు ప్రత్యేక విమానం వేసుకొని వెళ్ళి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు లేదా పార్టీల అధినేతలతో సమావేశమయ్యి కలిసి పనిచేద్దామని ఒత్తిడి చేస్తున్నారు. అదీ తప్పు కాదు. ఏపీలో బిఆర్ఎస్‌ ప్రవేశించాలనుకోవడం తప్పు కాదు. ఏపీలో కేసీఆర్‌ తొత్తుల చేత బిఆర్ఎస్‌ ఏర్పాటుని అభినందిస్తూ ఫ్లెక్సీ బ్యానర్లు పెట్టించుకొని వాటి గురించి గొప్పగా చెప్పుకొంటుంది.

నిజానికి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏనాడూ తెలంగాణ రాజకీయాలలో జోక్యం చేసుకోలేదు. కానీ కేసీఆరే 2019 ఎన్నికల సమయంలో ఏపీ రాజకీయాలలో వేలుపెట్టి చంద్రబాబుని గద్దె దింపడానికి జగన్మోహన్ రెడ్డికి, వైసీపీకి సహాయసహకారాలు అందించారనే సంగతి అందరికీ తెలుసు.

రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌కి ధీటుగా ఏపీకి అమరావతి రాజధానిని నిర్మించాలని ప్రయత్నిస్తుండటం, ఏపీని గాడిలో పెట్టుకొని మళ్ళీ ఏదోవిదంగా అభివృద్ధి చేసుకోవాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నించడమే కేసీఆర్‌కి కంటగింపుగా మారిందనేది బహిరంగ రహస్యం. అందుకే చంద్రబాబుని గద్దె దించేవరకు నిద్రపోలేదు. ఒకవేళ చంద్రబాబు మునుగోడు ఉపఎన్నికలలో బిజెపికి మద్దతు ఇవ్వడం తెలంగాణలో కుట్రలు పన్నడమే అయితే మరి కేసీఆర్‌ ఏపీలో చేసిన ఈ నిర్వాకం ఏమిటి?కేసీఆర్‌ చేసిన నిర్వాకానికి నేడు ఆంధ్రప్రదేశ్‌ ఎటువంటి దుస్థితిలో ఉందో అందరూ కళ్ళారా చూస్తున్నారు.

రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఏపీని, టిడిపిని ఇంత దారుణంగా దెబ్బ తీసిన కేసీఆర్‌ మళ్ళీ ఏ మొహం పెట్టుకొని ఏపీలో బిఆర్ఎస్‌ను విస్తరించాలని వస్తున్నారో… ఆయన ఈసడించుకొన్న ఏపీ ప్రజలనే ఓట్లు అడగడానికి ఎలా మొహం చెల్లుతుందో నమస్తే తెలంగాణయే చెప్పాలి. కేసీఆర్‌ ఏపీకి వస్తే అందరూ జేజేలు పలకాలి. కానీ చంద్రబాబు నాయుడు తెలంగాణకు వెళితే కుట్రలు, కుతంత్రాలు చేయడానికే వచ్చారని విషం చిమ్మడం మొదలైపోతుంది. అంటే తెలంగాణలో టిడిపి పోటీ చేయడాన్ని కేసీఆర్‌ నిషేదిస్తున్నారా?

అయినా దశాబ్ధాలుగా కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని, పార్టీలను, ప్రజలను ఇంతగా ద్వేషిస్తూ, ఏపీకి ఈ దుస్థితి కల్పించిన కేసీఆర్‌ దేశాన్ని ఉద్దరిస్తానని బయలుదేరుతుండటం ఆశ్చర్యంగా లేదా?తెలంగాణలో ఏకచత్రాధిపత్యం చలాయించడం కోసం, వంశపాలన కోసం ఆ రాష్ట్రంలోని పార్టీలన్నిటినీ నిర్వీర్యం చేసిన కేసీఆర్‌, రేపు జాతీయరాజకీయాలలో ప్రవేశించి ఒకవేళ ప్రధాని అయితే దేశంలో ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేయకుండా ఉంటారా?ఇలా ప్రశ్నించుకొంటూ పోతే ఎంతైనా ఉంటుంది.

రాజకీయాలను రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ ఈవిదంగా కుట్రలు, కుతంత్రాలతో ఎదుర్కోవడం రాజకీయమనిపించుకోదు. అటువంటి రాజకీయాన్ని వాక్చాతుర్యం, భాషా చాతుర్యంతో సమర్ధించుకోవడం సిగ్గుచేటు.