
నేడు కేసీఆర్ 71 వ పుట్టిన రోజు సందర్భంగా 71 కేజీల కేక్ ను కట్ చేసిన బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ఆయన జన్మదినవేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆమరణ నిరాహార దీక్ష చేసారంటూ కొనియాడారు.
గతంలో మహాత్మా గాంధీ గారి సత్యాగ్రహం చూసాం, పొట్టి శ్రీరాముల గారి ఆమరణ నిరాహార దీక్ష చూసాం, కానీ ఈ తరంలో ఆ మహనీయుల మాదిరే కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్షతో ప్రత్యేక తెలంగాణ సాధన సాధ్యమయ్యింది అంటూ కేటీఆర్ తో కలిసి కేసీఆర్ జన్మదిన వేడుకలలో పాల్గొన్నారు హరీష్ రావు.
Also Read – అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం.. భేష్!
ఇక బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కేసీఆర్ రాజకీయ వారసుడు, తెలంగాణ రాష్ట్రానికి కాబోయే సీఎం అంటూ ప్రచారం జరుగుతున్న కేటీఆర్ మాట్లాడుతూ ఆ పార్టీ క్యాడర్ ఆశల మీద నీళ్లు జల్లారు. కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ తెలంగాణ కారణజన్ముడు, తెలంగాణ ప్రజల హృదయాలలో నిలిచిన కేసీఆర్ కోసం తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు.
ఈ రాష్ట్రానికి మరోసారి ముఖ్యమంత్రిగా కేసీఆరే కావాలంటూ తెలంగాణ సమాజం కోరుకుంటుందని, ఆ దిశగా 60 లక్షల గులాబీ దండు ఒక సైన్యంలా కలిసి పని చేసి ఈ సారి ఎన్నికలలో బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని, కేసీఆర్ ను మరో మారు ముఖ్యమంత్రిగా చేసుకుందాం అంటూ పార్టీ క్యాడర్ కు పిలుపునిచ్చారు.
Also Read – అయ్యో పాపం.. టీడీపీ కార్యకర్తలు!
దీనితో ఎన్నాళ్ళుగానో బిఆర్ఎస్ పార్టీలో చర్చనీయాంశం గా మారిన కాబోయే సీఎం కేటీఆర్ అనే ప్రచారానికి కేటీఆర్ తన వ్యాఖ్యలతో ఒక క్లారిటీ ఇచ్చినట్టయ్యింది. ఈసారి కూడా కేసీఆరే బిఆర్ఎస్ ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ కేటీఆర్ కుండబద్దలు కొట్టడంతో చిన్నబాబు ఈసారి కూడా సైడ్ అయినట్టేనా అంటున్నారు కేటీఆర్ అభిమానులు.
అయితే వయసు రీత్యా, కేసీఆర్ ఆరోగ్యం రీత్యా ఈ సారి బిఆర్ఎస్ ముఖ్యమంత్రి అభ్యర్థి పేరు మారుతుంది, తద్వారా ఆ పార్టీలో మొదలయ్యే రాజకీయ అనిచ్చితిని తమకు అనుకూలంగా మలచుకోవచ్చు అని ఆశపడ్డ ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు కూడా కేటీఆర్ ఈ సందర్భముగా అటువంటి అవకాశం ఉండబోదు అంటూ ముందస్తు సమాచారం ఇచ్చారు.
Also Read – జగన్ మోడల్ బెస్ట్ అంటున్న రేవంత్ రెడ్డి!
అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు అనేది వాస్తవం . కాబట్టి మరో నాలుగేళ్లలో తెలంగాణ రాజకీయాలు ఏ మలుపు తిరుగనున్నాయో, వాటి ఫలితంగా బిఆర్ఏఎస్ లో ఇంకెన్ని మార్పులు చోటు చేసుకుంటాయో ఎవరికెరుకా.? ప్రస్తుతానికి తెలంగాణ సీఎం గా రేవంత్ రెడ్డి పాలన కొనసాగుతుంది. ఇక ఆపైన ఏమిటి అనేది కాలమే బదులివ్వాలి.