ఇటీవల కాలంలో సినిమాల ‘లెంగ్త్’ ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతున్నాయి. ముఖ్యంగా పెద్ద సినిమాలు విడుదలై, తొలిరోజు డివైడ్ టాక్ తెచ్చుకున్న తర్వాత, కొన్ని సన్నివేశాలను లేపేయడం వంటివి సర్వసాధారణంగా జరుగుతున్నాయి. అయితే మెగాస్టార్ రీ ఎంట్రీ మూవీ విషయంలో మాత్రం ఇలాంటి తప్పులు దొర్లేందుకు ఆస్కారం లేకుండా స్వయంగా ఈ పర్యవేక్షణలను చూసుకున్నట్లుగా తెలుస్తోంది. ఫైనల్ కాపీ తర్వాత చిరు పూర్తి సంతృప్తిగా ఉన్నారని, ఇంకా ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదని చెప్పినట్లుగా ట్రేడ్ టాక్.
అయితే అంతకుముందే ‘30 ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ’ విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకున్నారని, పృధ్వీ నటించిన ఎపిసోడ్ అంతా ‘ఎడిటింగ్’లో ‘కటింగ్’కు గురైందని, బ్రహ్మానందం సీన్ల కోసం పృధ్వీ నటించిన సన్నివేశాలన్నీ తీసేసారని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీనిని బలపరిచే విధంగా పృధ్వీ, సోషల్ మీడియా ద్వారా తన ఆవేదనను వెలిబుచ్చారు. ‘మెగాస్టార్ గారి 150వ సినిమాలో నటించడం నా అదృష్టం, కానీ సీన్లు తీసివేయడం నా దురదృష్టం, సంక్రాంతి రోజున నా తల్లి చనిపోయినంత బాధగా ఉంది’ అంటూ ఆవేదన వ్యక్తపరిచారు.
అయితే పృధ్వీ వ్యాఖ్యల పట్ల నెటిజన్ల నుండి భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ఒక సినిమాలో పాత్రను ఎడిటింగ్ చేసినంత మాత్రాన వచ్చిన నష్టమేమీ ఉండదని, నిజానికి మెగాస్టార్ లాంటి వ్యక్తులతో నటించేటపుడు కమెడియన్లకు ఎక్కువ సీన్ ఉండదని, కాబట్టి దీని నుండి పృధ్వీ పెద్దగా నష్టపోయేదేమీ ఉండదని కామెంట్స్ చేస్తుండగా, మరికొందరు మాత్రం మెగాస్టార్ సినిమాలో కనపడితే దక్కే గుర్తింపే వేరని, అందుకే పృధ్వీ ఇంతలా స్పందించి ఉంటారని అంటున్నారు. ఏది ఏమైనా పృధ్వీ మాత్రం… తనకు తీవ్ర అన్యాయం జరిగిందని వాపోతున్నారు.
కొసమెరుపేమేమిటంటే… ‘పృధ్వీ’ పాత్ర కటింగ్ పై చిత్ర యూనిట్ నుండి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు.



