ఈ బాబాయ్ అబ్బాయ్ కాంబినేషన్‌ ఏపీకి వరమే

Kinjarapu Atchannaidu and Rammohan Naidu

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ‘బాబాయ్ అబ్బాయ్’ అంటే టక్కున వివేకానంద రెడ్డి, జగన్మోహన్‌ రెడ్డిలు గుర్తుకు వస్తారు. ‘హూ కిల్డ్ బాబాయ్?’ అనే నారా లోకేష్‌ స్లోగన్ సోషల్ మీడియాలో చాలా కాలంపాటు ట్రెండింగ్ అయ్యింది కూడా. పదవీ, అధికారం కోల్పోయినా నేటికీ బాబాయ్ కేసు విచారణ ముందుకు కదలకుండా బ్రేకులు వేసి పట్టి ఉంచుతున్నాడంటే మామూలు విషయం కాదుగా! ఆ అబ్బాయే తల్లిని, చెల్లిని కూడా బయటకు సాగనంపాడు.

ADVERTISEMENT

కానీ ‘బాబాయ్ అబ్బాయ్’ రిలేషన్‌షిప్ అంటే ఇలాగే ఉండదు. ఇందుకు పూర్తి భిన్నంగా కూడా ఉంటుందని పవన్‌ కళ్యాణ్‌, రామ్ చరణ్‌ నిరూపిస్తున్నారు. బాబాయ్ పిఠాపురం నుంచి శాసనసభకు పోటీ చేస్తుంటే అబ్బాయ్ రామ్ చరణ్‌ వచ్చి ఆయనకు సంఘీభావం తెలిపాడు. బాబాయ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే అబ్బాయ్ ఆనందంతో పొంగిపోయాడు తప్ప ‘అలా’ అనుకోలేదు.

శ్రీకాకుళం జిల్లాలో కూడా ఇలాంటి ‘బాబాయ్ అబ్బాయ్’ ఉన్నారు. వారే రాష్ట్ర మంత్రి అచ్చన్నాయుడు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు.

రోడ్డు ప్రమాదంలో ఎర్రంనాయుడు మరణించిన తర్వాత ఆయన కుమారుడు రామ్మోహన్ నాయుడుకి అండగా నిలబడి రాజకీయాలలోకి తీసుకు వచ్చి ప్రోత్సహించింది బాబాయ్ అచ్చన్నాయుడే. రామ్మోహన్ నాయుడు కూడా ‘బాబాయ్’ని తండ్రితో సమానంగా ప్రేమిస్తుంటారు. వారిద్దరి మద్య అనుబంధం గురించి జిల్లాలో అందరికీ తెలుసు.

కనుక ‘బాబాయ్ అబ్బాయ్’ అంటే లేపేసుకోవడమే కాదు ఇంకా చాలా ఉందని అర్దమవుతోంది.

విషయంలోకి వస్తే, ఈ ‘బాబాయ్ అబ్బాయ్’ ఇద్దరూ కలిసి తమ జిల్లా అభివృద్ధికి చాలా కృషి చేస్తున్నారు. కేంద్రమంత్రిగా అబ్బాయ్ జిల్లాకు ప్రాజెక్టులు తీసుకువస్తుంటే, రాష్ట్ర మంత్రిగా బాబాయ్ ప్రభుత్వం తరపున శరవేగంగా వాటికి క్లియరెన్స్ వచ్చేలా చేస్తున్నారు.

శ్రీకాకుళం నుంచి విశాఖ వరకు సముద్రతీరం వెంబడి ‘సాగరమాల’ పేరుతో ఆరులేన్ల రోడ్డు నిర్మాణానికి అబ్బాయ్ ఢిల్లీలో పనులు చక్కబెడుతున్నారు. ఈ ‘బాబాయ్ అబ్బాయ్’లను చూసే నిర్మాణంలో ఉన్న మూలపేట పోర్టుకి సమీపంలో భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) సుమారు లక్ష కోట్లతో రిఫైనరీ ఏర్పాటుకి ఆసక్తి చూపిస్తోంది. త్వరలోనే ఆ సంస్థ ఎండీ జీ.కృష్ణారావు సిఎం చంద్రబాబు నాయుడుతో భేటీ కాబోతున్నారు.

ఇక రామ్మోహన్ నాయుడు పౌరవిమానశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులను ఏడాదిలోగా పూర్తి చేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. అప్పుడే ఆ మంచబ్బాయ్ శ్రీకాకుళం జిల్లా, మూలపేట పోర్టుకు సమీపంలోనే ఓ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు.

ఎయిర్ పోర్ట్, బీపీసీఎల్ ఏర్పాటుకి అవసరమైన భూసేకరణ చేసి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి అచ్చన్నాయుడు సంసిద్దత వ్యక్తం చేశారు. సిఎం చంద్రబాబు నాయుడు కూడా ఎయిర్ పోర్ట్, బీపీసీఎల్ ఏర్పాటుకి అన్ని విదాలా సహకరిస్తామని చెపుతున్నారు.

కనుక ‘ఆ బాబాయ్ అబ్బాయ్’ కాంబినేషన్‌ రాష్ట్రానికి తీరని అప్రదిష్ట, ఆ కేసు కారణంగా కొత్త తలనొప్పులు, ఆర్ధిక భారం తెచ్చి పెడితే ‘ఈ బాబాయ్ అబ్బాయ్’ కాంబినేషన్‌ రాష్ట్రానికి, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకు పెద్ద వరంగా మారబోతోంది.

ADVERTISEMENT
Latest Stories