తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డికి ఏమైనా కాలు విరిగిందా… జగన్మోహన్ రెడ్డి వచ్చి పలకరించడానికి?అంటూ గుడివాడ వైసీపి ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల సిఎం రేవంత్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ, “నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంతవరకు ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి నాకు ఫోన్ చేసి పలకరించలేదు. ఆయన ఆలోచనలు, దారి వేరు. నా ఆలోచనలు, దారి వేరు.
నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నందున ఆయన మా రాజకీయ శత్రువుగానే పరిగణిస్తాను. వైఎస్ షర్మిల మా కాంగ్రెస్ పార్టీలో చేరారు కనుక ఆమెకు, ఏపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ఆమె చేసే ప్రయత్నాలకు నేను పూర్తి మద్దతు, సహాయసహకారాలు అందిస్తాను,” అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.
దీనిపై కొడాలి నాని స్పందిస్తూ, “రేవంత్ రెడ్డి ఏమైనా అంత గొప్పవారా జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పలకరించేందుకు? కేసీఆర్ తుంటి ఎముక విరిగి చికిత్స చేయించుకున్నారు కనుక జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పలకరించారు. రేవంత్ రెడ్డికి కూడా కాలు విరిగిందా… జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పలకరించడానికి?
రేవంత్ రెడ్డి ఏమైనా సుప్రీం లీడరా?మాకు ఆయన అపాయింట్మెంట్స్ అవసరమే లేదు. తెలంగాణలో మాకు ఏవైనా పనులు ఉంటే మేను నేరుగా సోనియా, రాహుల్, ప్రియాంకా గాంధీలతో మాట్లాడి చేయించుకోగలము. వాటి కోసం మేము రేవంత్ రెడ్డికి ఫోన్లు చేయక్కరలేదు… వెళ్ళి ఆయనని కలవక్కరలేదు.
అయినా తెలంగాణలో మాకు రాజకీయాలు అవసరం లేదనే కదా మేము అక్కడ నుంచి మా వైసీపిని తీసేశాం? అక్కడ ఎవరు గెలిస్తే మాకేమిటి… ఎవరు ఒడితే మాకేమిటి?
రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేయడానికే వైఎస్ షర్మిలకు మద్దతు ఇస్తానంటున్నారు. అంతకంటే ఆయన తన సిఎం పదవికి రాజీనామా చేసి ఇక్కడకు వచ్చి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టవచ్చు కదా ఎవరు వద్దన్నారు?
రేవంత్ రెడ్డి, వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వారితో మాకు ఎటువంటి సంబంధమూ లేదు. వారి రాజకీయాలకు మేము ధీటుగానే ఎదురుకొంటాము. ఎవరు వచ్చినా మాకేమీ ఇబ్బంది, భయం లేదు,” అని కొడాలి నాని అన్నారు.
ఏపీ సిఎం హోదాలోనే జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వెళుతున్నప్పుడు ఆయనకు పోలీస్ బందోబస్తు చేయాలని ఏపీ సిఎంవో తెలంగాణ ప్రభుత్వాన్ని లిఖితపూర్వకంగా కోరగా అలాగే ఏర్పాటు చేసింది. ఓ ముఖ్యమంత్రి హోదాలో హైదరాబాద్‌కు వస్తున్న జగన్మోహన్ రెడ్డిని తెలంగాణ ప్రభుత్వం గౌరవించినప్పుడు, కొత్తగా ముఖ్యమంత్రి పదవి చేపట్టిన రేవంత్ రెడ్డిని, ఆయన మంత్రులను జగన్మోహన్ రెడ్డి ఓసారి కలిసి పలకరించడం కనీసం మర్యాద కదా?
జగన్ ముఖ్యమంత్రి కాగానే హైదరాబాద్ పరుగెత్తి వెళ్ళి కేసీఆర్‌ని కౌగలించుకున్నారు. కానీ ఇప్పుడు సాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పలకరించడానికి కూడా జగన్ ఇష్టపడలేదు!అంటే సిఎం రేవంత్ రెడ్డి కంటే కాలు విరిగి మంచం మీద ఉన్న మాజీ సిఎం కేసీఆరే తనకు ముఖ్యమని చెప్పకనే చెప్పారు. అందుకే సిఎం రేవంత్ రెడ్డి కూడా ఆవిదంగా స్పందించారు.
జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరూ మిత్రుల కంటే శత్రువులనే పెంచుకొంటారని చెప్పడానికి ఇంతకంటే గొప్ప నిదర్శనం ఏముంటుంది?మద్యలో కొడాలి నాని వంటివారు చేసే ఇటువంటి అనుచిత వ్యాఖ్యలతో ఆ శతృత్వాన్ని ఇంకా రాజేస్తుంటారు.




