కూటమి హావలో టీడీపీ తిరువూరు ఎమ్మెల్యే గా తొలి అవకాశం అందుకున్న కొలికపూడి వచ్చిన ఆ ఒక్క ఛాన్స్ ని తన చర్యలతో వైసీపీ మాదిరి కాలదన్నుకుంటున్నారు. అధికార పార్టీలో ఉంటూనే పార్టీ కంటిలో నలుసు మాదిరి నిత్యం ఎదో ఒక వివాదంతో వార్తలలో నిలుస్తున్నారు, పార్టీ పేరుని లాగుతున్నారు.
క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే టీడీపీ లో అంతర్గత అసమ్మతి లాగ కొలికపూడి వ్యవహారం అటు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి అదనపు తలనొప్పిగా మారుతుంది. ఇప్పటి వరకు కొలికపూడి వ్యవహార శైలి మీద పార్టీ అధినేతగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాబూ ఎన్ని సార్లు హెచ్చరించినా ఆయన వ్యవహారశైలిలో మార్పు శూన్యం.
తాజాగా ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం వేణుగోపాల స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి ఆలయాన్ని సందర్శించారు. అయితే ప్రోటోకాల్ ప్రకారం ఆలయ అధికారులు ఎంపీ చిన్నికి స్వామి వారి పట్టువస్త్రాలు, ఎమ్మెల్యే కొలికపూడికి స్వామి వారి తలంబ్రాలు అందించారు.
కానీ కొలికపూడి తనకు పట్టువస్త్రాలే కావాలని ఎంపీ చిన్ని చేతి నుంచి స్వామివారి పట్టువస్త్రాల పళ్లెం ను గుంజుకుని ఆ స్వామి వారి ఎదుటే వివాదానికి తెరలేపారు. అయితే కొలికపూడి చేసిన పనికి ఏమి చెయ్యలేక చిన్ని పట్టువస్త్రాలను కొలికపూడికే ఇచ్చేసి పూజ కార్యక్రమాలు ముగించుకుని వెళ్లిపోయారు.
ఒకే పార్టీలో ఉంటూ ఇలా నిత్యం సొంత పార్టీ నేతల మీద రుబాబులు చూపిస్తూ కొలికపూడి చేస్తున్న ఈ చర్యలు అటు టీడీపీ పార్టీ క్యాడర్ కి సైతం అసహనాన్ని కలిగిస్తున్నాయి. పార్టీలోనే ఉంటూ పార్టీ పేరును వివాదాలలోకి లాగుతూ, సొంత పార్టీ నేతల మీదే రాజకీయ ఆదిపత్యాలు ప్రదర్శిస్తూ టీడీపీ పార్టీకి కొండంత భారంగా మారారు కొలికపూడి.
పార్టీ అధిష్టానం నుంచి ఎన్ని సార్లు హెచ్చరికలు వచ్చినా, పార్టీ క్రమశిక్షణ సంఘం నుంచి ఎన్నిసార్లు మందలింపులు వెళ్లినా కొలికపూడి తానుపట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అనేలా వచ్చిన ఈ ఒక్క ఛాన్స్ నే తన ఆఖరి ఛాన్స్ గా మలుచుకునేందుకు నిత్యం ప్రయత్నిస్తున్నారు.




