మన కోనసీమ ప్రభలు… ప్రమోషన్స్ లేవే!

Konaseema Prabhala Theerthalu traditional procession during Sankranti

సినీ నటీనటులు, దర్శక నిర్మాతలు తమ సినిమాలకు రకరకాలుగా ప్రమోషన్స్ చేసుకుంటారు. అదేవిధంగా ప్రభుత్వాలు కూడా తాము చేసిన మంచి పనుల గురించి రకరకాలుగా ప్రమోషన్స్ చేసుకుంటాయి. చివరికి ప్రతిపక్షాలు కూడా గట్టిగానే ప్రమోషన్స్ చేసుకుంటాయి.

ఇలా ఎవరికి వారు ప్రమోషన్స్ చేసుకుంటున్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి కూడా ప్రమోషన్స్ చేయాలిగా?

ADVERTISEMENT

దేశంలో పలురాష్ట్రాలు ఆన్‌లైన్‌లో తమ రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల గురించి ప్రకటనలు ఇస్తుంటాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పర్యాటక రంగానికి ‘పారిశ్రామిక హోదా’ కల్పించింది. కనుక పర్యాటక శాఖ ఆంధ్రప్రదేశ్‌ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు కృషి చేస్తోందా లేదా?అనే ప్రశ్నకు అదే జవాబు చెప్పాలి.

సంక్రాంతి పండుగ సందర్భంగా మొన్న కోనసీమ జిల్లా, ఆత్రేయపురంలో నిర్వహించిన ‘పడవ పందాలు’ గురించి నాలుగు ఫోటోలు వీడియోలు పెడితేనే సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి.

మరి అలాంటప్పుడు కోనసీమలో నేటి నుంచి మొదలైన ‘ప్రభల తీర్థాలు’ ‘ప్రభల ఊరేగింపులు’ గురించి ప్రచారం చేయడం అవసరమే కదా?

కోనసీమ జిల్లాలో 160 ప్రాంతాలలో ఈ తీర్దాలు జరుగుతాయి. వాటిలో ముఖ్యంగా 11 గ్రామాల ప్రజలు కలిసి జరుపుకునే ఈ ప్రభల తీర్థాలలో నేడు అంబాజీపేట మండలంలోని మోసలపల్లి కొబ్బరితోటలో జరుగబోయే ‘జగ్గన్నతోట తీర్థం’ చాలా ప్రసిద్ధమైంది. దీనిలో పాల్గొనేందుకు చుట్టుపక్కల జిల్లాల నుంచి వేలాదిమంది తరలివస్తుంటారు.

మన దేశంలో వందల సంవత్సరాల నుంచి కొనసాగే పండుగలు, పబ్బాలు, జాతరలు అనేకం ఉన్నాయి. వాటిలో ఈ ప్రభల తీర్దాలు కూడా ఒకటి. సుమారు 450 ఏళ్ళుగా ఈ తీర్థాలు నిర్వహిస్తున్నారు.

17వ శతాబ్దంలో జగ్గన మహారాజుగా ప్రసిద్ధి చెందిన రాజా వత్సవాయ జగన్నాధ మహారాజు లోక కల్యాణం కొరకు 11 మంది ‘ఏకాదశ రుద్రులు’ ఒక్క చోట కొలువు తీరాలని సంకల్పించి ఈ ప్రభల తీర్థాలు ప్రారంభించినట్లు చరిత్ర చెపుతోంది.

అప్పటి నుంచి ఏటా సంక్రాంతి పండుగ తర్వాత కనుమ, ముక్కనుమ పండుగ రోజులలో వీటిని జరుపుతున్నారు. సాధారణంగా పండుగ సమయంలో జరిగే ఇటువంటి ప్రభలు, తీర్థాలు, జాతరలు దేవీదేవతలు వారి ఆలయాలు కేంద్రంగా జరుగుతుంటాయి. అయితే ఈ ప్రాంతంలో దీనికి సంబంధించి ఎటువంటి ఆలయం లేకపోవడం విశేషం.

ఇంత చారిత్రిక నేపధ్యం ఉన్న ఈ ‘ప్రభల తీర్థాలు’ కనీసం రాష్ట్ర స్థాయిలోనే తగిన గుర్తింపు, ప్రచారం లేకపోవడం చాలా శోచనీయం. రాష్ట్ర స్థాయిలోనే గుర్తింపుకి నోచుకోనప్పుడు ఇక జాతీయస్థాయిలో ఎలా లభిస్తుంది?

ప్రజలందరినీ కలిపే ఇలాంటి సామూహిక ఉత్సవాలు జరపాలని 450 సంవత్సారాల క్రితమే గొప్ప ఆలోచన కలగడమే చాలా గొప్ప విషయం. ఇలాంటి ఓ గొప్ప సామోహిక ఉత్సవాలకు తగిన గుర్తింపు, ప్రచారం లభించకపోయినా యధాతధంగా కొనసాగుతూనే ఉన్నాయి.

కూటమి ప్రభుత్వం ఈ ప్రభల తీర్థాలని రాష్ట్ర పండుగ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రభల తీర్థాల గురించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది. ఇంత ఆలస్యమైనప్పటికీ ఎట్టకేలకు ప్రభుత్వం గుర్తించింది. వీటి గురించి మీడియా ద్వారా ప్రచారం చేస్తే, మన చారిత్రిక, సాంస్కృతిక వైభవం గురించి అందరికీ తెలుస్తుంది. ఈ ప్రభలు కూడా పర్యాటక ఆకర్షణగా మారుతాయి కదా!

ADVERTISEMENT
Latest Stories