కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ వివాదం నానాటికి ముదురుతోంది. సురేఖ కుమార్తె సుస్మిత సీఎం రేవంత్ టార్గెట్ గా చేసిన విమర్శల పట్ల మంత్రిగా సురేఖ వివరణ ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదనేది కాంగ్రెస్ లో అంతర్గతంగా వినిపిస్తున్న మాట.
నాకు సంబంధం లేదు అంటూ తప్పించుకోవడానికి రేవంత్ ని పొలిటికల్ గా టార్గెట్ చేసింది సురేఖ బంధువులు కాదు, స్వయానా సురేఖ సొంత కుమార్తె. ఆ విషయంలో మంత్రి సురేఖ సంబంధం లేదంటూ తప్పుకోవడం బదులుగా తప్పు జరిగింది ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటాం అని కానీ లేదా సుస్మిత వ్యాఖ్యలను తానూ ఖండిస్తున్నా అని కానీ చెప్పి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది అనే భావన పార్టీ నేతలలో కనిపిస్తుంది.
కానీ ఇప్పటికి సురేఖ ఆ దిశగా అడుగులేసేందుకు సుముఖత చూపకపోవడంతో వివాదం ముదిరి ముదిరి చివరికి సురేఖ మంత్రి పదవి బర్తరఫ్ వరకు చేరింది. ఇటు తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సైతం కొండా సుస్మిత వ్యాఖ్యల పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పార్టీ లైన్ దాటితే ఎవరికైనా కఠిన చర్యలు తప్పవు అంటూ ప్రకటించినా సురేఖ మాత్రం తన మౌనాన్ని వీడలేదు.
ఇక తాజాగా కొండా సురేఖ ఈ వివాదాన్ని ముగించేందుకు తన బీసీ కార్డ్ ని బయటకు తీసే పనిలో పడ్డారు అంటూ ప్రచారం జరుగుతుంది. ఇందులో భాగంగానే మంత్రి కొండా సురేఖ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ను కలిసేందుకు ప్రయత్నించగా అందుకు భట్టి నిరాకరించినట్టు సమాచారం.
ఇక నిన్న ఆదివారం మంగుళూరు లో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే తో సమావేశమైన మంత్రి కొండా సురేఖ తాము ఎక్కడ కాంగ్రెస్ పార్టీని కానీ సోనియా, రాహుల్ ని కానీ విమర్శించలేదని అధిష్టానానికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు. అయితే అందుకు ఖర్గే రాష్ట్ర కమిటీ కి తన వివరణ అందించాలని సూచనలు చెయ్యగా ఇప్పటికే లేఖల రూపంలో రెండు సార్లు రాష్ట్ర స్థాయి నేతలకు వివరణ ఇచ్చినట్టు సురేఖ చెప్పుకొచ్చారు.
కొండా సురేఖ తన పై పార్టీ లో ప్రభుత్వంలో పెరుగుతున్న అసమ్మతిని తొలగించుకునేందుకు చేస్తున్న ఈ ప్రయత్నాలేమీ ఫలితాలను ఇచ్చేలా కనిపించడం లేదని, కొండా సురేఖ వ్యవహారం మొదటి నుంచి పార్టీకి ప్రభుత్వానికి భారంగానే ఉందంటూ పార్టీలో అనేకమంది నేతలు సురేఖ పై భగ్గు మంటున్నారు. మరి సురేఖ ఇప్పటికైనా ఆకులు పెట్టుకుంటారా.?లేదా పూర్తిగా చేతులు కాలే వరకు వేచి చూస్తారా.?





