రాఖీ పండుగ.. ఇలా ఉపయోగపడింది ఒక్కొకరికీ…

సామాన్య ప్రజల ఇళ్ళలో నేడు రాఖీ పండుగని పండుగలాగే జరుపుకుంటున్నారు. సినీ పరిశ్రమలో సెలబ్రిటీల రాఖీ పండుగ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. రాజకీయాలలో రాఖీ పండుగ వేరే రకంగా జరుగుతుంది.

బిగ్ బాస్‌లకు రాఖీ కట్టేందుకు చెల్లెమ్మలందరూ క్యూ కడతారు. అలాగే తెలంగాణ మహిళా మంత్రులు సీతక్క, కొండా సురేఖ తదితరులు కూడా జూబ్లీహిల్స్‌లోని సిఎం రేవంత్‌ రెడ్డి ఇంటికి వెళ్ళి రాఖీలు కట్టారు.

ADVERTISEMENT

ఇటీవల కూతురు సుస్మిత కారణంగా కొండా సురేఖ మంత్రి పదవి కోల్పోయే ప్రమాదంలో చిక్కుకున్నారు. కనుక నేడు లభించిన ఈ అవకాశాన్ని ఆమె సద్వినియోగం చేసుకున్నారు. ఆమె కూడా మిగిలిన మహిళా మంత్రులతో కలిసి జూబ్లీహిల్స్‌లోని సిఎం రేవంత్‌ రెడ్డి ఇంటికి వెళ్ళి, రేవంత్ అన్న కోసం ప్రత్యేకంగా బంగారంతో తయారు చేయించిన రాఖీ కట్టారు. తద్వారా రాజీకి సిద్ధమని సంకేతం ఇస్తూ మంత్రి పదవి కాపాడుకునే ప్రయత్నం చేసినట్లు భావించవచ్చు. కానీ రేవంత్ అన్న మనసు కరుగుతుందా? చెల్లి సురేఖని మంత్రి పదవిలో కొనసాగిస్తారా?త్వరలో తెలుస్తుంది.

రాఖీ పండుగ రోజు రాఖీ కట్టి కొందరు ఈవిధంగా రాజకీయాలు చేసుకుంటే, కట్టకుండా రాజకీయాలు చేశారు టీఆర్ఎస్‌ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.

“గత ఏడాది అన్నకు రాఖీ కడదామనుకుంటే ఊళ్ళో నుంచి జంప్. పోనీ ఈ ఏడాదయినా కడదామనుకుంటే విదేశాలకు జంప్.. ఎంతకని ప్రాదేయపడతాను? నాకూ ఆత్మాభిమానం ఉంటుందిగా?” అంటూ కట్టని రాఖీ సాక్షిగా అన్నని సమాజం ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశారు.

ఏపీలో ఏకైక రాజకీయ అన్నయ్యకి సొంత చెల్లెలు ఈసారి కూడా రాఖీ కట్టలేదు. గనుక ‘మీ ప్రేమాభిమానాలే నా బలం, నాకు కొండంత ధైర్యం. మీ సోదరుడిగా నాపై మీరు చూపుతున్న ఆప్యాయ‌త‌కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. ఈ రాఖీ పౌర్ణమి మీ అందరి జీవితాల్లో ఆనందాలు, ప్రేమానుబంధాలు, ఆయురారోగ్యాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా అక్కచెల్లెమ్మలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు,” అని ట్వీటేసి మమ అనిపించారు.

షర్మిల చెల్లెమ్మ కూడా అదేవిధంగా “సోదర,సోదరీమణుల అనుబంధానికి, అపారమైన ప్రేమకు, ఆప్యాయత మరియు రక్షణకు ప్రతీక రక్షాబంధన్. తెలుగు రాష్ట్రాలలోని ప్రతి అన్నకు, తమ్ముడికి రాఖీ పండుగ శుభాకాంక్షలు. నా అన్న తమ్ముళ్లు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, అష్ట ఐశ్వర్యాలు పొందాలని ఈ పర్వదినం సందర్భంగా మనస్పూర్తిగా కోరుకుంటున్నా,” అంటూ ట్వీటేసి మమ అనిపించారు.

సొంత అన్నా చెల్లెళ్ళు కలిసి రాఖీ పండుగ జరుపుకోలేనప్పుడు ఊళ్ళో వాళ్ళకి ఇలాంటి మాటలు చెప్తే విచిత్రంగా ఉండదూ?

ADVERTISEMENT
Latest Stories