ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి కొండా సురేఖ రాజకీయాలలో ఉన్నారు. కనుక ఆమెకు అపారమైన రాజకీయ అనుభవం ఉంది. కానీ అది ఆమెకు ఉపయోగపడుతున్నా దానిని సద్వినియోగం చేసుకోలేక ప్రతీసారి ఇలా చతికిలపడుతున్నారు.
ఆమె కూతురు సిఎం రేవంత్ రెడ్డి, ఆయన సోదరులపై చేసిన వ్యాఖ్యల వలన మంత్రి పదవి ఊడినట్లు పైకి కనిపిస్తోంది. కానీ ఆమె చాలా కాలంగా పలు వివాదాలలో చిక్కుకుంటూనే ఉన్నారు. సాటి మంత్రులు ఫైల్స్ పై సంతకాలు చేయడానికి కమీషన్లు తీసుకుంటున్నారంటూ బహిరంగంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి పనులలో చిలక కొట్టుళ్ళ విషయంలో సాటి మంత్రులతో గొడవలు పడ్డారు. ఇలా ఒకటా రెండా చాలానే ఉన్నాయి. ఇవన్నీ ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొనేలా చేస్తూనే ఉన్నాయి
కనుక ఆమెను బయటకు పంపించడానికి సరైన కారణం కోసం చూస్తున్న సిఎం రేవంత్ రెడ్డికి ఆమె కుమార్తె కొండా సుస్మిత స్వయంగా చక్కటి అవకాశం కల్పించారని చెప్పవచ్చు.
తెలంగాణ కాంగ్రెస్‌లో ఆమె ఎదుగుదల, ఈ పతనం కేవలం ఓ రాజకీయ వార్త, విశ్లేషణ మాత్రమే కాదు. ఇది ఆంధ్రప్రదేశ్‌లో కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఓ ‘కేస్ స్టడీ’గా చూస్తే ఇలాంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్తగా మెసులుకునేందుకు చాలా ఉపయోగపడుతుంది.
అధికారంలో ఉన్నవారు బహిరంగంగా ఏది మాట్లాడాలి? ఏది మాట్లాడకూడదు? సాటి మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలతో ఎలా మెసులుకోవాలి? తమ రాజకీయ ప్రత్యర్ధుల ఉచ్చులో చిక్కుకుంటే ఏవిధంగా నష్టపోతాము? వంటి పాఠాలు నేర్చుకునేందుకు ఈ కేస్ స్టడీ చక్కగా ఉపయోగపడుతుంది.
ముఖ్యంగా ప్రభుత్వంలో మూడు పార్టీలు భాగస్వాములుగా ఉన్నందున ఆయా పార్టీల ప్రజా ప్రతినిధులు, నేతల మద్య విభేదాలు, ఘర్షణలు తప్పవు. కనుక అందరూ మరింత జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం.
ఈ విషయంలో టీడీపి నేతలకు మంచి అనుభవం ఉంది కనుక వారు ఇటువంటి సమస్యలలో చిక్కుకున్నా త్వరగా బయటపడగలరు.
కానీ జనసేనలో పవన్ కళ్యాణ్‌తో సహా అందరూ మొదటిసారి పదవులు చేపట్టారు. తొలిసారి అధికారం లభించింది. కనుక వారు కొండా సురేఖ రాజకీయ ప్రస్థానం గురించి తప్పక తెలుసుకోవాలి. ఇది వారు తప్పటడుగులు వేయకుండా జాగ్రత్త పాడేందుకు పనికివస్తుంది.
కూటమిలో బిజేపి కూడా భాగస్వామిగా ఉన్నప్పటికీ, ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు ఎన్నడూ అత్యుత్సాహం ప్రదర్శించిన దాఖలాలు లేవు. కనుక కూటమి ప్రభుత్వంలో జనసేన ఇలాంటి రాజకీయ పాఠాలు నేర్చుకోవడం దానికే మేలు చేస్తుంది.





