నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని ముప్పతిప్పలు పెడుతున్నారు. ఆయన పార్టీలో ఉన్నప్పుడు సిఎం జగన్మోహన్ రెడ్డిని ఒప్పించి తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు కేటాయింపజేసుకొన్నారు. కానీ మూడేళ్ళయినా ఆ నిధులు విడుదల చేయలేదు… అభివృద్ధిపనులు మొదలుపెట్టలేదంటూ తీవ్ర విమర్శలు, దీక్షలు, ధర్నాలు చేస్తున్నారు. వాటి కోసం నియోజకవర్గంలో ప్రజల చేత ముఖ్యమంత్రికి ఉత్తరాలు వ్రాయిస్తున్నారు.
ఆయన పోరాటాలతో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిపనులు చేయించలేకపోతోందని చాటింపు వేస్తున్నట్లవుతోంది. అలాగని ఆయన ఒత్తిడి భరించలేక నిధులు కేటాయించి అభివృద్ధి పనులు ప్రారంభిస్తే, “నా పోరాటాలతో ప్రభుత్వం మెడలు వచ్చి పనులు చేయిస్తున్నానని” ఆయన చెప్పుకొంటారు. కనుక నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేసినా, చేయించకపోయినా వైసీపీయే నష్టపోతుంది. క్రెడిట్ మాత్రం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికే దక్కుతుంది.
తాజాగా గాంధీ నగర్‌లో క్రీస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం పోరాటం మొదలుపెట్టారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామని జగన్ స్థానిక క్రీస్టియన్లకు హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు నిర్మించలేదు. దీంతో కోటంరెడ్డి వైసీపీని ఇరుకున పెట్టేందుకు నెల్లూరులో అన్ని చర్చిలకు వెళ్ళి కమ్యూనిటీ హాల్ కోసం నిర్మాణం తాను చేస్తున్న పోరాటం గురించి వివరించి, ఒక్కో ఇటుకను విరాళంగా అడిగి తీసుకువచ్చారు. తద్వారా జిల్లాలో చర్చిలను, క్రీస్టియన్ మతస్తులను తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు.
కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం ప్రభుత్వానికి ఇచ్చిన గడువు ముగియడంతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మంగళవారం ఉదయం తన అనుచరులు, నియోజకవర్గంకి క్రీస్టియన్ ప్రాజాలతో కలిసి ఈరోజు ఉదయం కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టవలసిన చోట ధర్నాకు బయలుదేరారు. ఒకవేళ ప్రభుత్వం నిర్మించకుంటే తన సొంతడబ్బుతో నిర్మిస్తానని చెపుతున్నారు.
దీంతో ఈరోజు ఉదయమే పోలీసులు కోటంరెడ్డి, ఆయన అనుచరుల ఇళ్ళను చుట్టుముట్టి గృహనిర్బందం చేశారు. అయితే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దీనిని తనకు అనుకూలంగా మలుచుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం చేస్తానని చెప్పి చేయలేకపోయిన పనిని తన సొంత డబ్బుతో చేస్తానంటే దానికీ అడ్డుతగులుతోందని, కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయనేయకుండా తనను గృహనిర్బందం చేయించిందని కోటంరెడ్డి చేస్తున్న ఆరోపణలు నియోజకవర్గంలో ప్రజలకు బాగానే చేరుతున్నాయి. స్థానిక ప్రజలలో ఆయన పట్ల సానుభూతి, ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఏర్పడుతుందని వేరే చెప్పక్కరలేదు. కనుక కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఏవిదంగా ఎదుర్కోవాలో, ఏవిదంగా కట్టడి చేయాలో తెలియక వైసీపీ ప్రభుత్వం తల పట్టుకొంటోంది.



