తెలంగాణ శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోబోతోందని కేసీఆర్, కేటీఆర్‌తో సహా ముఖ్య నేతలకు మూడు నెలల ముందుగానే తెలుసని కేసీఆర్‌కి అత్యంత సన్నిహితుడు ఎర్రబెల్లి దయాకర్ రావు ఇటీవల చెప్పారు.
ఎన్నికలలో ఓడిపోతామని మూడు నెలల ముందే తెలిసి ఉన్నప్పటికీ, మాజీ మంత్రి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటింగ్ ముందు రోజున తుపాకీతో గురిపెడుతున్న ఫోజుతో ‘హ్యాట్రిక్ లోడింగ్’ అంటూ ట్వీట్ చేశారు.
ఎగ్జిట్ పోల్స్ చూసి పార్టీలో ఎవరూ ఆందోళన చెందనవసరం లేదని, మనమే ముచ్చటగా మూడోసారి గెలిచి అధికారంలోకి రాబోతున్నామని ట్వీట్ చేశారు. కేసీఆర్ కూడా బిఆర్ఎస్ పార్టీ 100కి పైగా సీట్లు గెలుచుకుంటుందని చివరి క్షణం వరకు నమ్మబలుకుతూనే ఉన్నారు. కానీ కేవలం 39 సీట్లు మాత్రమే దక్కించుకొని ఘోరపరాజయం పాలైంది.
తెలంగాణను అంతగా అభివృధ్ది చేసి, అనేక సంక్షేమ పధకాలు కూడా అమలుచేసిన కేసీఆర్ 119కి 100 సీట్లు మాత్రమే వస్తాయని చెప్పుకుంటే, అభివృద్ధి పనులన్నీ నిలిపివేసి ఏపీని అప్పుల ఊబిలో ముంచేశారు. కానీ ప్రజలకు ‘మేలు’ చేశాము కనుక ఈసారి 175 సీట్లు మేమే గెలుచుకుంటామని ప్రగల్భాలు పలికారు.
మేమే మళ్ళీ అధికారంలోకి రాబోతున్నామంటూ విల్లు-బాణం పట్టుకొన్న ఫోటోతో ‘జగన్ 2.0’ అని ట్వీట్ చేశారు. కానీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం వైసీపి ఓడిపోబోతోంది.
బిఆర్ఎస్ పార్టీకి ఓడిపోబోతున్నామని మూడు నెలల ముందుగా తెలిస్తే, వైసీపి ఓడిపోబోతోందని ఏడాది క్రితమే జగన్‌కు తెలుసు. ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం బయట పెట్టారు.
ఏడాది క్రితం జగన్ తనను ఢిల్లీలో కలిసినప్పుడే సంక్షేమ పధకాలతో ముందుకు సాగితే ఓడిపోవడం ఖాయమని చెప్పానని కానీ జగన్ తాము 175 సీట్లు గెలుచుకుంటామని చెప్పి వెళ్ళిపోయారని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. ఈసారి ఎన్నికలలో వైసీపికి 51 కంటే తక్కువే సీట్లు రావచ్చని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. ఆయన చెప్పిన్నట్లుగానే నిన్న ప్రకటించిన పలు ఎగ్జిట్ పోల్స్ లో వైసీపికి 14 నుంచి 48 లోపు సీట్లు రావచ్చని స్పష్టమైంది కూడా.
కేటీఆర్ కౌంటింగ్ ముందురోజు వరకే మభ్యపెడితే, జగన్ కౌంటింగ్ తర్వాత కూడా భ్రమ పెట్టాలని ప్రయత్నించడం విశేషం. ఆ ప్రయత్నంలోనే జూన్ 9వ తేదీన 9.38 గంటలకు విశాఖలో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడానికి ముహూర్తం కూడా ప్రకటించుకున్నారు.
ఈవిదంగా చివరి నిమిషం వరకు అందరినీ మభ్యపెట్టాలని అనుకున్నారే తప్ప దాంతో తామే నవ్వులపాలవుతామని జగన్ గ్రహించలేదు. ఏదైనా అనుభవపూర్వకంగా తెలుసుకుంటే ఆ అనుభూతే వేరు!




