గుంటూరు బాగుంది… వైజాగ్ బాగుంది… ఒప్పుకొంటున్నా: కేటీఆర్‌

హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు ఏర్పాటు చేసిన ఓ సమావేశానికి తెలంగాణ ఐ‌టి, పరిశ్రమలు, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్‌ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్‌ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో వివరిస్తూ, “ఇదివరకు ఏపీ రాజధాని అమరావతిని కూడా ఇలాగే అభివృద్ధి చేద్దామనుకొన్నారు కానీ ప్రస్తుతం అక్కడ పనులన్నీ నిలిచిపోయాయని” అన్నారు. ఏపీ గురించి ఇంతకు మించి తానేమి మాట్లాడబోనని చెపుతూ, ఇదివరకు ‘క్రెడాయ్’ సమావేశంలో తన స్నేహితుడు ఏపీ గురించి చెప్పిన విషయాన్ని తాను ఒక్కసారి చెపితే, మీడియాలో దానిని వందసార్లు చెప్పడం వలన చాలా తలనొప్పిగా మారిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

ADVERTISEMENT

“కనుక ఏపీలో గుంటూరు బాగుంది…. విజయవాడ కూడా బాగుంది. విశాఖపట్నం కూడా చాలా బాగుంది. ఏపీలో అన్నీ చాలా బాగున్నాయి… అంతే,” అని ముసిముసినవ్వులు నవ్వుతూ అన్నారు. ఇంతకు మించి ఏపీ గురించి నేనేమీ మాట్లాడనని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కానీ ఏమీ మాట్లాడను అంటూనే కేటీఆర్‌ చెప్పదలచినది ముసిముసినవ్వులతో చెప్పేశారు.

ఏపీలో ఈ ప్రధాన నగరాలలో పరిస్థితిలో పెద్దగా మార్పు లేదనే విషయం అందరికీ తెలుసు. రాష్ట్రంలో గుంతలు పడిన రోడ్లను మరమత్తులు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తుండటం, రోడ్ల మరమత్తులే చేయించలేని ప్రభుత్వం మూడు రాజధానులు ఏం ఏర్పాటు చేయగలదని ప్రతిపక్షాలు దెప్పిపొడుస్తుండటం అందరూ వింటూనే ఉన్నారు.

కనుక ముంజేతి కంకణం చూసుకొనేందుకు మళ్ళీ అద్దం ఎందుకన్నట్లు, అందరికీ తెలిసిన ఏపీలో పరిస్థితుల గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పుకోవడం ఎందుకు?అని కేటీఆర్‌ చెప్పిన్నట్లు అర్దమవుతోంది.

అమరావతి నిర్మాణపనులను నిలిపివేసి మూడు రాజధానులపేరుతో ఏమీ చేయకుండా నాలుగేళ్ళు కాలక్షేపం చేసేసినప్పుడు, ఎవరైనా ఇలాగే వేలెత్తి ఎద్దేవా చేస్తుంటారు. అలాగని ఉక్రోషంతో ఎదురుదాడి చేస్తే తెలంగాణ మంత్రులు నోరు విప్పితే మన పరువే పోతుంది కనుక కేటీఆర్‌ చేసిన ఈ వ్యాఖ్యలు వినబడనట్లు ఊరుకోవడమే మంచిది.

ADVERTISEMENT
Latest Stories