బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న జనసేన్ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ని అడిగిన ప్రశ్నలనే కేసీఆర్‌ని, కేటీఆర్‌ని తిరిగి అడిగితే…
వేలమంది బలిదానాలతో తెలంగాణ ఏర్పడిందని కేటీఆర్ అన్నారు. మరి కేవలం 500 మంది అమరవీరుల కుటుంబాలనే ఆదుకొని మిగిలినవారిని ఎందుకు గాలికి వదిలేశారు?
ఆ అమరవీరుల బలిదానాల ఫలాలు ఎవరు ఆరగించారు?ఎవరు వేలు లక్షల కోట్ల ఆస్తులు కూడబెట్టుకున్నారు? తమకు పదవులు, అధికార భాగ్యం కల్పించిన అమరజీవుల కుటుంబాలనే పట్టించుకోని కల్వకుంట్ల కుటుంబం తెలంగాణలో జనసేన పార్టీ ప్రజల ఆకాంక్షలు, ఉద్యమాలు గౌరవించాలని చెప్పడం విడ్డూరంగా ఉంది కదా?
తెలంగాణ ఏర్పాటు సమయంలోనే ఆంధ్రాలో కూడా విభజనని వ్యతిరేకిస్తూ ఉద్యమాలు జరిగాయి. వాటిని దొంగ ఉద్యమాలని కేసీఆర్ ఎగతాళి చేశారు. కానీ తెలంగాణ ఉద్యమాల గురించి ఎవరైనా మాట్లాడితే మా ఆత్మగౌరవం దెబ్బ తీస్తున్నారంటూ ఎదురుదాడి చేస్తారు.
కేసీఆర్ సైలన్లు పెట్టుకొని చేసిన 10 రోజులు దీక్ష గురించే అన్ని గొప్పలు చెప్పుకుంటున్నప్పుడు, పొట్టి శ్రీరాములు నిజంగా చనిపోయేవరకు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే దాని గురించి కూడా కేటీఆర్ నిన్న ఇంత చులకనగా మాట్లాడారు. ఈ అహంభావమే బీఆర్ఎస్ పార్టీ కొంప ముంచిందని నేటికీ గ్రహించలేదు కనుకనే అమరజీవి గురించి అలా మాట్లాడారు.
నాడు ఉద్యమ సమయంలో కేసీఆర్ ఆంద్ర బిర్యానిని పేడతో పోల్చారు. సంక్రాంతి గొబ్బెమ్మలను పేడతో ఆడుకుంటారని ఎద్దేవా చేశారు. అవన్నీ చెప్పుకుంటే ఆంధ్రా ప్రజల గుండెలు రగిలిపోతాయి.
ఆంధ్రా నేతలను, ప్రజలను, సంస్కృతిని అంతగా అవహేళన చేసి ఆంధ్రాని రెండు ముక్కలు చేసే వరకు నిద్రపోని కేసీఆర్, మళ్ళీ ఆంధ్రాలో బీఆర్ఎస్ పార్టీని విస్తరించేందుకు ఎందుకు బయలుదేరారు?
అప్పుడు ఆంధ్రా ప్రజల మనోభావాలను, ఆకాంక్షలను తాము గౌరవించలేదని, అవహేళన చేశామని కేటీఆర్‌కు గుర్తులేదా?
అందుకే పవన్ కళ్యాణ్ ఓ మాటన్నారు. “తెలంగాణలో తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉంది. కానీ రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రాలో ఏ సెంటిమెంటు లేదు. జై ఆంధ్రా అనే వాళ్ళు కూడా లేరు. పైగా మూడు రాజధానులు, మావిగన్ అంటున్నా అభ్యంతరం చెప్పేవారు ఎవరూ లేరు. అందుకే ఆంధ్రావాళ్ళంటే తెలంగాణ నాయకులకు ఇంత చులకన,” అని అన్నారు.
ఇది అక్షరాల నిజం. కేసీఆర్ ఏపీలో బీఆర్ఎస్ పార్టీ విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ పేరుతో రాజకీయాలు చేసేందుకు ప్రయత్నించినప్పుడు ఆంధ్రా ప్రజలు అభ్యంతరం చెప్పకపోవడమే ఇందుకు నిదర్శనం.
చివరికి చంద్రబాబు నాయుడుని గద్దె దించేందుకు కేసీఆర్, జగన్‌తో చేతులు కలిపి తెరచాటు రాజకీయాలు చేస్తున్నప్పుడు ప్రజలు చూస్తూ ఊరుకున్నారు.
ఆ విధంగా అమరావతి నిర్మాణానికి అడ్డుపడి, రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు, పెట్టుబడులు కేసీఆర్ తెలంగాణకు తరలించుకుపోతున్నా ఆంధ్రా ప్రజలు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు.
విభజనతో ఒకసారి, విభజన తర్వాత కూడా ఆంధ్రాని, అమరావతిని, చంద్రబాబు నాయుడుని దెబ్బతీసి, నేటికీ ఆయన పేరుతో, నీళ్ళ పేరుతో రాజకీయాలు చేసుకుంటున్న బీఆర్ఎస్ పార్టీ ఇలా సుద్దులు చెపుతుంటే నవ్వొస్తుంది.
కేసీఆర్ పాలన గురించి ఎవరో చెప్పక్కరలేదు సొంత కూతురే చెప్తున్నారుగా? అయినా తెలంగాణకు ఆయనే దిక్కట!
నాడు కేసీఆర్ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ తప్ప మరో పార్టీ ఉండకూడదనుకున్నారు. కేటీఆర్ కూడా అదే కోరుకుంటున్నారు. కానీ మాటకారితనంతో అదే విషయం తిప్పి తిప్పి ఈవిధంగా చెప్పుకుంటున్నారు. అంతే!




