మా ముఖ్యమంత్రి కేసీఆర్‌… మీ ముఖ్యమంత్రి ఎవరు?

Telangana KTRతెలంగాణ శాసనసభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అధికార బిఆర్ఎస్‌, కాంగ్రెస్‌, బిజెపిల మద్య రాజకీయ ఆధిపత్యపోరు నానాటికీ ముదురుతోంది. తెలంగాణ ఐ‌టి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ నిన్న ఓ ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ 9 ఏళ్ళలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి వివరించి తమను కాదనడానికి ఒక్క కారణం చెప్పాలని ప్రతిపక్షాలకు సవాలు విసిరారు.

తమ పార్టీ బిజెపికి బీ-టీమ్‌ అని కాంగ్రెస్‌ చేస్తున్న ఆరోపణలను ఆయన బలంగా తిప్పి కొడుతూ, నిజానికి కాంగ్రెస్ పార్టీయే బిజెపికి బీ-టీమ్‌. రాహుల్ గాంధీ వంటి అసమర్ద నాయకుడున్న కాంగ్రెస్‌ పార్టీ తమకు ఎప్పటికీ ప్రత్యర్ధిగా ఉండాలని బిజెపి కోరుకొంటోంది. అదే నిర్భయంగా నిలదీసి అడిగే కేసీఆర్‌ వంటివారు ప్రత్యామ్నాయంగా వద్దని బిజెపి కోరుకొంటోందని అన్నారు. బిఆర్ఎస్‌ పార్టీ నేతలపై ఈడీ, ఐ‌టి దాడులు చేయిస్తున్న మోడీ ప్రభుత్వం కాంగ్రెస్‌ నేతల జోలికి వెళ్ళడం లేదని గుర్తుచేశారు.

ADVERTISEMENT

ప్రధాని నరేంద్రమోడీ నిన్న భోపాల్‌లో ఓ కార్యక్రమంలో తెలంగాణ సిఎం కేసీఆర్‌ గురించి మాట్లాడటాన్ని కూడా కేటీఆర్‌ ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ, జాతీయ రాజకీయాలలో కేసీఆర్‌ ప్రభావాన్ని గుర్తించిన్నట్లే ఉన్నారని అన్నారు. అయితే తాము ఈడీ, మోడీ, బోడిలను చూసి భయపడబోమని, ఎవరు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటామని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

ఈ సందర్భంగా కేటీఆర్‌ కాంగ్రెస్‌, బిజెపిలకు ఓ సవాల్ విసిరారు. మా ముఖ్యమంత్రి కేసీఆర్‌. మరి మీ పార్టీల ముఖ్యమంత్రి అభ్యర్ధులు ఎవరో ప్రకటించగలరా?అని సవాల్ విసిరారు. ఎందుకంటే, తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో ఓ అరడజను మంది ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో సహా మరో ఇద్దరు ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. కనుక ఈ సవాలుకి ఆ రెండు పార్టీలు జవాబు చెప్పలేవు. చెపితే పార్టీలు నిలువునా చీలిపోయే ప్రమాదం ఉంటుంది.

ఏపీలో అధికార వైసీపీ కూడా టిడిపి, జనసేనలకు ఇదేవిదంగా సవాలు చేస్తోంది. అయితే ఏపీలో ఈ పాచిక పారడం లేదు. ఎందుకంటే ఆ రెండు పార్టీలు ఇంకా పొత్తులు పెట్టుకోలేదు. పెట్టుకొంటాయో లేదో కూడా తెలీదు. కనుక టిడిపికి చంద్రబాబు నాయుడు, జనసేనకు పవన్‌ కళ్యాణ్‌ ముఖ్యమంత్రి అభ్యర్ధులని ఆ పార్టీలు ధైర్యంగా చెప్పుకొంటున్నాయి.

ADVERTISEMENT
Latest Stories