KTR Bandi Sanjay

దాదాపు కవిత అరెస్టయిన 5 నెలల తరువాత బైలు రావడంతో కవితతో పాటు కేసీఆర్ కూడా స్వేచ్ఛ వచ్చినట్టయ్యింది. అయితే కవిత విడుదలతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. క్రైమ్, వైన్, డైన్ లో భాగస్వాములైన బిఆర్ఎస్, కాంగ్రెస్ లు చేసిన అలుపెరుగని పోరాటాలు ఎట్టకేలకు ఫలించాయి అంటూ బీజేపీ నేత బండి సంజయ్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.

కవిత బైలు కోసం శ్రమించిన కాంగ్రెస్ పార్టీ తరుపు న్యాయవాదులకు శుభాకాంక్షలు తెలుపు, ఈ కేసు వాదించిన లాయర్ రాజ్యసభకు ఎన్నిక కావడంలో కేసీఆర్ తన చతురత ప్రదర్శించారు అంటూ కేసీఆర్ పైన, కవిత బైలు పైన సెటైరికల్ ట్వీట్ వేశారు బండి సంజయ్. అలాగే బీజేపీ, బిఆర్ ఎస్ పార్టీల కుమ్మక్కు రాజకీయాలలో భాగమే కవిత బైలు అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు.

Also Read – వైసీపీకి గమనిక: డీఎస్సీ అంటే ఉద్యోగాల భర్తీకి!

కవిత బైలుతో మొదలైన బిఆర్ఎస్ విలీన ప్రక్రియ కేసీఆర్ పదవితో ముగుస్తుంది అంటూ కాంగ్రెస్ తన రాజకీయ విమర్శలకు పదును పెట్టింది. బీజేపీ, బిఆర్ఎస్ లు ఒక్కటయ్యి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి కుయుక్తులు పన్నుతున్నాయని వారి ఆటలు తెలంగాణ ప్రజలు సాగనివ్వరు అంటూ కాంగ్రెస్ నేతలు బీజేపీ, బిఆర్ఎస్ ల పై పదునైన అస్త్రాలను సిద్ధం చేస్తున్నారు.

ఇదిలా ఉంటె బీజేపీ నేత కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కవిత బెయిల్ పై చేసిన వ్యాక్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి కూడా గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు పై అభ్యంతరకర వ్యాక్యలు చేస్తారా.? బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల మీద సుప్రీం కోర్ట్ వెంటనే స్పందించాలి, ఈయన పై న్యాయాధిక్కార చర్యలకు ఆదేశాలివ్వాలి కోరుకుంటున్న అంటూ తన X లో పోస్ట్ చేసారు కేటీఆర్.

Also Read – సుబ్బారెడ్డి vs సాయి రెడ్డి…

మొత్తానికి తెలంగాణ రాజకీయంలో కాంగ్రెస్, బీజేపీ, బిఆర్ఎస్ మూడు పార్టీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం చూస్తుంటే ఈ మూడు పార్టీల మధ్య రాజకీయం నడుస్తుందా? లేక రాజీ నడుస్తుందా.? అనేది సామాన్యుడికే కాదు రాజకీయ విశ్లేషకులకు సైతం అంతుచిక్కని ఒక ‘బ్రహ్మ పదార్ధం’ లా మిగిలిపోయింది.

విలీనమంటూ ఒకరు, కుమ్మక్కులంటూ మరొకరు, న్యాయం గెలిచింది, ధర్మం నెగ్గింది అంటూ వేరొకరు ఇలా కుదిరితే రాజకీయం కుదరక పొతే రాజీ అంటూ ముందుకెళ్తున్నాయి మూడు పార్టీలు. అయితే ‘రాజకీయ’ నాయకుల ‘రాజీ’ లో కూడా రాజకీయమే ఉంటుందనేది జగమెరిగిన సత్యమే.

Also Read – సంగీతంలో లెజెండ్ – మీడియా అంటే ఆమడ దూరం. వివాదాల భయమా?