ఒక చిన్న గీతను పెద్దది చేసి చూపాలంటే దాని పక్కన ఇంకా చిన్న గీత గీస్తే చాలు. అలాగే ఓ పెద్ద గీతని చిన్నది చేసి చూపాలన్నా పక్కనే ఇంకా పెద్ద గీత గీస్తే చాలు.
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పుడు అదే చేస్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉందిప్పుడు.
ఒకవైపు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ. మరోవైపు టీఆర్ఎస్ పార్టీతో కల్వకుంట్ల కవిత. బీఆర్ఎస్ పార్టీలో నుంచి ముఖ్యనేతలు, కార్యకర్తలను ఆకర్షించి తీసుకుపోయేందుకు తెర వెనుక ప్రయత్నాలు మొదలుపెట్టే ఉంటారు. వలసలు మొదలైతే బీఆర్ఎస్ పార్టీ సగం ఖాళీ అయిపోవడం ఖాయమే.
బిజేపి తదుపరి లక్ష్యం తెలంగాణ రాష్ట్రమే అని ప్రధాని మోడీ చెప్పేశారు. బిజేపి పెద్దలు గట్టిగా దృష్టి పెట్టి పనిచేస్తే ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, ఒడిసా రాష్ట్రాలు వచ్చి ఒళ్ళో పడ్డాయి. కనుక ప్రధాని మోడీ మాటలని లైట్ తీసుకోలేము.
ఇంత జరుగుతున్నా కేసీఆర్ ఫామ్‌హౌసు వదిలి బయటకు రావడం లేదు. ఈ పరిస్థితిలో పార్టీ శ్రేణుల ఆత్మస్థైర్యం కోల్పోకుండా, టీఆర్ఎస్ పార్టీ వైపు చూడకుండా కాపాడుకునేందుకు కేటీఆర్ చిన్న గీతని పెద్ద గీతగా చూపేందుకు టీడీపితో పోల్చి చూపుతున్నారు.
తెలుగు రాష్ట్రాలలో టీడీపి, బీఆర్ఎస్ పార్టీలు మాత్రమే 25 ఏళ్ళకు పైగా నిలబడ్డాయని, మధ్యకాలంలో అనేక పార్టీలు పుట్టి గిట్టాయని కేటీఆర్ అన్నారు.
నాడు ఎన్టీఆర్‌కి తెలుగు ప్రజలలో విపరీతమైన ఆదరణ ఉండేది. ఎన్టీఆర్‌ని ప్రజలు రాముడు, కృష్ణుడుగా చూసేవారు. గౌరవించేవారు. కానీ కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు కనీసం అయన వెంట ఒక్కరు కూడా లేరు. చేతిలో డబ్బు లేదు. ప్రజలతో పరిచయం లేదు కనుక ఆయన మాటలని ఎవరూ నమ్మేవారు కారు.
అలాంటి పరిస్థితులలో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పెట్టి తెలంగాణ సాధించారు. టీఆర్ఎస్ పార్టీ రెండున్నర దశాబ్దాల పాటు అన్ని ఆటుపోట్లు తట్టుకొని నిలబడింది. నేడు పార్టీకి లక్షల మంది కార్యకర్తలున్నారు. టీడీపి తర్వాత ఇన్నేళ్ళు నిలదొక్కుకున్న పార్టీ మనదే. కనుక కేసీఆర్ నాయకత్వంలో అందరం కలిసికట్టుగా పనిచేసి మళ్ళీ అధికారంలోకి వస్తాము,” అని అన్నారు.
టీడీపి గురించి నేడు ఈవిధంగా మాట్లాడిన కేటీఆర్, నాడు తన తండ్రి కేసీఆర్ టీడీపి ఎమ్మెల్యేలని, ముఖ్య నాయకులను టీఆర్ఎస్ పార్టీలో తెచ్చేసుకొని ఆ పార్టీని రాజకీయంగా బలహీన పరుస్తున్నప్పుడు తప్పుగా అనుకోలేదు.
ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు నాయుడు టీడీపిని విజయవంతంగా నడుపుతున్నారనే ముక్క చెప్పడానికి కేసీఆర్, కేటీఆర్‌లకు మనస్కరించదు.
చంద్రబాబు నాయుడుని ఆ బ్రహ్మ దేవుడు కూడా కాపాదలేడంటూ నాడు కేసీఆర్ ప్రగల్భాలు పలికి ఆయనని జైల్లో పెట్టాలని విఫలయత్నం చేసిన సంగతి అందరికీ తెలుసు. ఏపీలో అధికారంలో ఉన్న టీడీపిని గద్దె దించేందుకు కేసీఆర్ జగన్‌తో చేతులు కలపడం తప్పనుకోలేదు. చంద్రబాబు నాయుడుని జగన్ ప్రభుత్వం జైల్లో పెట్టినప్పుడు కేసీఆర్, కేటీఆర్ ఖండించక పోగా ఏవిధంగా వ్యవహరించారో అందరికీ తెలుసు.
నేటికీ చంద్రబాబు నాయుడుని రాష్ట్రాన్ని, రాష్ట్ర సంపదని, నీళ్ళని దోచుకుపోయే దొంగగా అభివర్ణిస్తూ, అయన పేరుతో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సెంటిమెంట్‌తో మనుగడ సాగిస్తోంది. అలాంటి పార్టీ టీడీపితో సమానమ్మనట్లు కేటీఆర్ చెప్పుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది… కదా?




