చిలుకూరు పరామర్శ పోటీలు… అందుకేనా?

KTR visits Chilukuru Balaji Temple priest

హైదరాబాద్‌, చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై నాలుగు రోజుల క్రితం దాడి జరిగింది. తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి మండలం, కొప్పూరుకి చెందిన వీరరాఘవ రెడ్డి అనే వ్యక్తి రామరాజ్యం పేరుతో సైనికులని ఏర్పాటు చేసుకొని వారిని వెంటబెట్టుకువెళ్ళి ఆయనపై దాడి చేశారు.

తమ రామరాజ్యం సంస్థకు భారీ విరాళం ఇచ్చి మద్దతు ప్రకటించాలని కోరగా ఆయన నిరాకరించినందుకు దాడి చేశారు.

ADVERTISEMENT

సిఎం రేవంత్ రెడ్డి ఆదేశం మేరకు వెంటనే హైదరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసి వీరరాఘవ రెడ్డితో ఆరుగురిని అరెస్ట్‌ చేశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.

ఈ ఘటన కంటే దీనిపై మూడు ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్‌, బిఆర్ఎస్, బీజేపిలు చేస్తున్న హడావుడే అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది.

సిఎం రేవంత్ రెడ్డి ఆదేశం మేరకు ముందుగా తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ వచ్చి రంగరాజన్‌ని పరామర్శించి వెళ్ళారు. ఆ తర్వాత బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ పరామర్శించి వెళ్ళారు.

ఆ తర్వాత తెలంగాణ బీజేపి అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పరామర్శించి వెళ్ళారు. తర్వాత మరో మంత్రి శ్రీధర్ బాబు ఆయనని పరామర్శించి వెళ్ళారు. ఇంకా చాలా మంది పరామర్శలకు వస్తూనే ఉన్నారు.

మూడు పార్టీలకు చెందిన నేతలు పోటాపోటీగా పరామర్శలకు ఎందుకు వస్తున్నారు. వారందరికీ రంగరాజన్‌పై అంత గౌరవం, అభిమానం ఉన్నందునా? అంటే కాదనే చెప్పొచ్చు.

త్వరలో గ్రేటర్ హైదరాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగనున్నాయి. హైదరాబాద్‌లో ఎన్నికలంటే హిందూ, ముస్లిం ఓటు బ్యాంకు రాజకీయాలు తప్పనిసరి.

సాధారణంగా మజ్లీస్, బీజేపిలు మాత్రమే మత రాజకీయాలు చేస్తుంటాయి. కానీ గ్రేటర్ ఎన్నికలు లౌకికవాద పార్టీలమని చెప్పుకునే కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీలకు కూడా చాలా కీలకం. కనుక చిలుకూరు బాలాజీ ఆలయం నుంచే పరామర్శలతో నగరంలోని హిందూ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఓటు బ్యాంకు రాజకీయాలు మొదలుపెట్టేశాయి.

ఇక నుంచి హైదరాబాద్‌తో సహా తెలంగాణలో అంతటా హిందూ, ముస్లిం ఓటు బ్యాంకు రాజకీయాలు ప్రారంభం కావచ్చు.

ADVERTISEMENT
Latest Stories