అంతర్జాతీయ స్థాయిలో నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం జరగాలని భావిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అందుకు అనుగుణంగానే నిర్మాణాలపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. తాజాగా కృష్ణానదిపై మూలపాడు వద్ద నిర్మించనున్న అమరావతి బ్రిడ్జ్ కు సంబంధించి ఓ ఆరు డిజైన్లను రూపొందించి, ప్రజల అభిప్రాయం నిమిత్తం సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఈ 6 డిజైన్లు కూడా ఒక్కొక్కటి ఒక్కో కాన్సెప్ట్ తో రూపొందించడం విశేషం.
తొలి కాన్సెప్ట్ ను ‘నమస్కారం’ పెట్టే విధంగా… రెండవ కాన్సెప్ట్ ‘కూచిపూడి’ నృత్య భంగిమ విధంగా… మూడవ కాన్సెప్ట్ ‘బుద్ధిజం’లోని యోగ ముద్రను ప్రతిబింబించే విధంగా… నాలుగవ కాన్సెప్ట్ ‘డబుల్ డెకర్’ విధంగా… అయిదవ కాన్సెప్ట్ ను ‘బుద్ధిజం’ సంస్కృతిని తెలిపే విధంగా… ఆరవ కాన్సెప్ట్ ను పడవలో ప్రయాణించే విధంగా… ప్రముఖ నిర్మాణ సంస్థ ‘ఎల్ అండ్ టీ’ రూపొందించింది.
ఈ 6 డిజైన్లు కూడా వేటికవే ప్రత్యేకం. అయితే నెటిజన్ల నుండి ఎక్కువ స్పందనలు తెచ్చుకున్నవి మాత్రం రెండు మరియు నాలుగు కాన్సెప్ట్ లు మాత్రమే. కూచిపూడి నృత్య భంగిమలో ఉన్న కాన్సెప్ట్ కు ఎక్కువ మంది ‘జై’ కొడుతుండగా, ఆ తర్వాత స్థానంలో ‘డబుల్ డెకర్’ మోడల్ ట్రాఫిక్ రద్దీని నియత్రించేందుకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. ప్రజా అభిప్రాయం తెలుసుకున్న తర్వాత సదరు డిజైన్ పై చంద్రబాబు అధికారిక ప్రకటన చేయనున్నారు.




