దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, చాలామంది కాంగ్రెస్ నేతల్లాగా వైసీపీలో చేరిపోకుండా నేటికీ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటంపై మీడియాలో వస్తున్న వార్తలను ఆయన కూడా ధృవీకరించారు.
ఆదివారం గన్నవరం విమానాశ్రయంలో రాహుల్ గాంధీని కలిసేందుకు వచ్చినప్పుడు విలేఖరులు వైఎస్ షర్మిల గురించి ప్రశ్నించగా అవును ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని తెలిపారు. ఓ కాంగ్రెస్‌వాదిగా రాజశేఖర్ రెడ్డి బిడ్డని పార్టీలో సాదరంగా స్వాగతిస్తామని చెప్పారు.
అయితే ఆమె తెలంగాణలోనే కొనసాగాలనుకొంటున్నట్లు చెపుతుండగా, ఆమెకు తెలంగాణ కాంగ్రెస్‌లో చోటు లేదని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఖరాఖండీగా చెపుతున్నారు. అదే సమయంలో ఆమెను ఏపీ కాంగ్రెస్‌లోకి స్వాగతిస్తామని కేవీపీ రామచంద్రరావు చెపుతున్నారు.
కనుక ఒకవేళ ఆమె ఏపీ కాంగ్రెస్‌లోకి వస్తే జగనన్నను, వైసీపీని ఎదుర్కోవడానికి కేవీపీ రామచంద్రరావు వంటివారు అండగా నిలబడేందుకు సిద్దంగా ఉన్నారని స్పష్టం అవుతోంది.
ఈనెల 8న వైఎస్సార్ జయంతి రోజున ఇడుపులపాయలో ఆయనకు నివాళులు అర్పించేందుకు సోనియా గాంధీ లేదా రాహుల్ గాంధీలు వస్తారని వారి సమక్షంలోనే వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కనుక మరో 5 రోజులలో వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరికపై స్పష్టత రావచ్చు.



