లగడపాటి సర్వే… యూపీలో బిజెపి… పంజాబ్ లో కాంగ్రెస్..!

Lagadapati survey on Uttar Pradesh  electionsఎన్నికల సర్వేల్లో కచ్చితమైన జోస్యం చెప్పే విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఫ్లాష్ టీం ఈ సారి ఉత్తరప్రదేశ్, పంజాబ్‌ లలోనూ సర్వే నిర్వహించింది. యూపీలో బీజేపీ అత్యధిక స్థానాలు సాధించి, గద్దెను ఎక్కుతుందని సర్వే వెల్లడించింది. ఈ సందర్భంగా లగడపాటి మాట్లాడుతూ యూపీలో ఎస్పీ-కాంగ్రెస్ ఒక్కటైనా బీజేపీ గెలవడానికి అనేక కారణాలు ఉన్నాయన్నారు.

సీఎం అఖిలేశ్‌కు వివాద రహితుడిగా పేరున్నా, పార్టీ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. అలాగే కాంగ్రెస్‌ తో కలవడంతో పాటు ఆ పార్టీకి వందకు పైగా సీట్లివ్వడం కూడా ప్రజల్లో వ్యతిరేకతకు ఓ కారణమన్నారు. ఎస్పీ అభ్యర్థుల్లో చాలామందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని, వారిపై ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత గురించి తెలిసినా అఖిలేశ్ పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఎస్పీ తరపున బరిలోకి దిగిన 225 మందిలో 120 మందికి పరాభవం తప్పదని రాజగోపాల్ జోస్యం చెప్పారు.

ADVERTISEMENT

ఇక యూపీలో బీజేపీ గద్దెనెక్కడం ఖాయమని చెప్పిన రాజగోపాల్, దీనికి ప్రధాని నరేంద్ర మోడీ విస్తృత ప్రచారమే కారణమని తెలిపారు. హిందూ ఓట్ల ఏకీకరణకు మోడీ ప్రసంగాలు బాగా పనిచేశాయని, రంజాన్ నాడు నిరంతరంగా విద్యుత్ ఇచ్చే అఖిలేశ్, దీపావళి రోజున ఇవ్వడం లేదని, ముస్లింల ఖబరస్థాన్ కోసం స్థలాలు ఇచ్చే ఎస్పీ ప్రభుత్వం హిందువులను విస్మరించిందన్న మోడీ ప్రచారం తీవ్ర ప్రభావం చూపిందని, అలాగే అందరి కంటే ముందుగా మోడీ చేసిన సన్నకారు రైతుల రుణాలు మాఫీ ప్రకటన బాగా పనిచేసిందన్నారు.

యూపీలో కాంగ్రెస్‌ కు 30-35 సీట్లు మాత్రమే వస్తాయని అంచనా వేసిన లగడపాటి సర్వే, పంజాబ్ పీఠాన్ని మాత్రం కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ఫ్లాష్ టీం వెల్లడించింది. అకాలీదళ్-బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, 117 స్థానాలున్న పంజాబ్‌ లో కాంగ్రెస్ గెలుపు తథ్యమని, ఆమ్ ఆద్మీ పార్టీ రెండో స్థానంతో సరిపెట్టుకుంటుందని లగడపాటి అంచనా వేశారు. కాంగ్రెస్‌కు 70 సీట్లు వస్తాయని, సిద్ధూ చేరిక కాంగ్రెస్‌ కు కలిసొస్తుందని, బీజేపీకి వచ్చేది 4-5 సీట్లు మాత్రమేనని వివరించారు.

ADVERTISEMENT
Latest Stories