Lata Mangeshkar Passed Awayదేశమంతా గర్వించే గాన కోకిల లతా మంగేష్కర్ 92 ఏళ్ళ వయసులో తనువు చాలించారు. కరోనా సోకిన తర్వాత వైద్య నిమిత్తం ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరగా, గత నెల రోజుల నుండి చికిత్స తీసుకుంటున్నారు. అయితే రెండు రోజుల క్రితం లతా ఆరోగ్యం విషమించిందని డాక్టర్లు ప్రకటించడంతో, ఏ క్షణమైనా ఈ దుర్వార్త చెవికందుతుందని భావించారు.

నేడు ఆ ప్రకటన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ నుండి రానే వచ్చింది. లతా వయసు రీత్యా చికిత్సకు పలు అవయవాలు స్పందించకపోవడంతో ఆమె తుది శ్వాస విడిచారు. 20 భాషల్లో దాదాపుగా 50 వేలకు పైగా పాటలు పాడి ‘గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ చోటు సంపాదించుకున్న ఈ “నైటింగేల్ ఆఫ్ ఇండియా” తెలుగులోనూ తన మధుర స్వరం వినిపించారు.

1955లో ‘నిద్దుర పోరా తమ్ముడా’ అన్న పాట సూపర్ హిట్ గా నిలువగా, 1965లో ఎన్టీఆర్ మూవీలో శ్రీ వేంకటేశ అన్న పాట ఇప్పటికీ తెలుగు శ్రోతలను ఆకట్టుకుంటోంది. అలాగే ఈ తరం హీరోలలో నాగార్జున ‘ఆఖరి పోరాటం’ సినిమాలో కూడా ఓ పాటను ఆలపించారు. దేశవ్యాప్తంగా కూడా సచిన్ టెండూల్కర్ వంటి అనేక మంది సెలబ్రిటీలు ఈ గానకోకిల స్వరానికి ఫిదా అయిపోయారు.

సంగీత ప్రపంచానికి ఆమె చేసిన విశేష సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2001లో “భారతరత్న,” 1999లో “పద్మవిభూషణ్,” 1969లో “పద్మభూషణ్” వంటి విశిష్టమైన సత్కారాలతో సన్మానించింది. అలాగే 2006లో ఫ్రాన్స్ ప్రభుత్వం ‘ది లీజియన్ ఆఫ్ హానర్” పురస్కారాన్ని కూడా అందజేసింది. ఈ సందర్భంగా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ‘మిర్చి9’ కోరుకుంటోంది.