సూపర్ స్టార్ రజనీకాంత్ భార్య లతారజనీకాంత్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ‘కొచ్చాడయాన్’ సినిమా హక్కుల అమ్మకానికి సంబంధించి యాడ్ బ్యూరో అడ్వర్టైజింగ్ కంపెనీకి చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ బకాయిలను చెల్లించాలంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలోనే సుప్రీంకోర్టు ఆదేశించింది. అయినప్పటికీ రజనీ కుటుంబం ఆ మొత్తాన్ని చెల్లించకపోవడంతో… ఈ రోజు సుప్రీంకోర్టు మరోసారి స్పందిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
‘కొచ్చాడయాన్’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల కోసం యాడ్ బ్యూరో నుంచి మీడియా వన్ సంస్థ 10 కోట్ల రుణం తీసుకుంది. మీడియా వన్ కు లతారజనీకాంత్ డైరెక్టర్ గా ఉండగా, ఒప్పందం ప్రకారం వడ్డీతో సహా డబ్బును చెల్లిస్తామని చెప్పి, ఆ తర్వాత కొంచెం మొత్తాన్ని మాత్రమే చెల్లించి, చేతులు దులిపేసుకున్నారని ఆరోపిస్తూ 2016లో యాడ్ బ్యూరో సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తమకు మాట మాత్రం చెప్పకుండా రెట్టింపు ధరకు తమిళ హక్కులను ఈరోస్ సంస్థకు అమ్ముకున్నారని తెలిపింది.



