వైసీపిలో ఒక్క దెబ్బకు నాలుగైదు ఫట్!

Lavu-Sri-Krishna-Devarayalu Ambati Rayudu

ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కొడితే గొప్పే కానీ ఒకే దెబ్బతో నాలుగైదు పిట్టలు ఎగిరిపోతే? వైసీపిలో అదే జరిగింది! నర్సారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు పార్టీకి, పదవికి రాజీనామా చేశారు. అంతకు ముందే అంబటి రాయుడు రాజీనామా చేశారు.

ADVERTISEMENT

కాపు సామాజికవర్గానికి చెందిన అంబటి రాయుడుకి గుంటూరు నుంచి లోక్‌సభ టికెట్‌ ఇస్తామనే హామీ ఇచ్చి జగన్మోహన్‌ రెడ్డి వైసీపిలో చేర్చుకున్నారు. కానీ ఆ తర్వాత నర్శారావుపేట వైసీపి ఎంపీని లావు శ్రీకృష్ణదేవరాయలను తాడేపల్లికి పిలిపించుకుని ఈసారి గుంటూరు నుంచి పోటీ చేయాలని జగన్‌ కోరారు. కానీ ఆయన ఏమాత్రం మొహమాటపడకుండా గుంటూరులో పార్టీ పరిస్థితి ఏమీ బాగోలేదని చెపుతూ నిరాకరించారు.

జగన్‌తనకు టికెట్‌ ఇస్తానని చెప్పి ఆ సీటుని లావు శ్రీకృష్ణదేవరాయలకు ఆఫర్ చేస్తున్నట్లు తెలిసి అంబటి రాయుడు షాక్ అయ్యారు. మరో క్షణం ఆలస్యం చేయకుండా పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరిపోయారు. అలా వైసీపిలో నుంచి మొదటి పిట్ట ఎగిరిపోయింది.

లావు శ్రీకృష్ణదేవరాయలు గుంటూరు నుంచి పోటీ చేయనని చెప్పేయడంతో బహుశః అధినేత అహం దెబ్బతిని ఉండవచ్చు. కనుక ఆయనకు నర్సారావు పేట టికెట్‌ ఇవ్వలేదు. దీంతో ఆయన కూడా పార్టీకి, పదవికి రాజీనామా చేసేశారు. దీంతో వైసీపిలో నుంచి రెండో పిట్ట కూడా ఎగిరిపోయింది.

అయితే జగన్‌ దెబ్బకు రెండు పిట్టలేనా?అని బాధపడక్కర లేదు. వైసీపిలో నుంచి మరికొన్ని పిట్టలు ఎగిరిపోవడానికి సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మాచర్ల వైసీపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నర్సారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఇద్దరూ కూడా మొదటి నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలకు పూర్తి మద్దతు పలుకుతున్నారు. ఆయన రాజీనామా చేయగానే వారిద్దరూ నర్సారావుపేటలో ఆయన భేటీ అయ్యారు.

కనుక జగన్‌ దెబ్బకు రెండు కాదు ఒకేసారి నాలుగైదు పిట్టలు వైసీపి నుంచి ఎగిరిపోనున్నాయన్న మాట! ఎంతైనా జగన్‌ వైసీపి అధినేత! ఆయన దెబ్బకు ఆ మాత్రం పవర్ లేకపోతే వైసీపికి నామోషీగా ఉండదూ!

ADVERTISEMENT
Latest Stories