డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడు అధికార వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబును కాపాడేందుకు పోలీసులు చాలా చక్కటి కట్టుకధ అల్లారని హైకోర్టు న్యాయవాది, జైభీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ అన్నారు.
అనంత బాబుని అరెస్ట్ చేయాలని తాను, ప్రతిపక్షాలు, ప్రజా, దళిత సంఘాలు గట్టిగా పోరాడకపోయుంటే పోలీసులు అసలు అనంత బాబును అరెస్ట్ చేసి ఉండేవారే కారని శ్రావణ్ కుమార్ అన్నారు. పోస్టుమార్టం నివేదికలో సుబ్రహ్మణ్యాన్ని హింసించడం వలన చనిపోయాడని పేర్కొనగా, సుబ్రహ్మణ్యం చనిపోయిన తరువాత అతని మృతదేహాన్ని అనంత బాబు కర్రతో కొట్టడం వలన గాయాలయ్యాని డీఎస్పీ రవీంద్రనాథ్ బాబు చెప్పడంలో అర్ధం ఏమిటని లాయర్ శ్రావణ్ కుమార్ ప్రశ్నించారు.
సుబ్రహ్మణ్యం ఒంటిపై సముద్రపు ఇసుకను బట్టి అతనిని అనంత బాబు అనుచరులు కాకినాడ సముద్రతీరానికి తీసుకువెళ్ళి అక్కడ చిత్ర హింసలు చేసినట్లు అనుమానం కలుగుతోందని శ్రావణ్ కుమార్ అన్నారు. వారందరినీ కాపాడేందుకే అనంత బాబు అల్లిన ఈ కట్టు కధను డీఎస్పీ రవీంద్రనాథ్ బాబు చెప్పారని అర్దమవుతూనే ఉందని లాయర్ శ్రావణ్ కుమార్ అన్నారు.
నేరం చేస్తే ఎంతటివారినైనా విడిచిపెట్టవద్దని సిఎం జగన్మోహన్ రెడ్డి చెప్పారని, అందుకే అనంత బాబును పోలీసులు అరెస్ట్ చేశారని వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ తదితరులు గొప్పగా చెపుకోవడాన్ని లాయర్ శ్రావణ్ కుమార్ తప్పు పట్టారు. అంటే ముఖ్యమంత్రి చెపితే తప్ప పోలీసులు హంతకులను కూడా పట్టుకోరా?వారిపై ఎటువంటి చర్యలు తీసుకోరా?అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో పోలీసులు, ఎస్సీ, ఎస్టీ కమీషన్‌కు అన్నీ వైసీపీ నేతల కనుసన్నలలో పనిచేస్తున్నందున వాటి విచారణలపై తమకు నమ్మకం లేదని కనుక హైకోర్టు, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమీషన్, మానవ హక్కుల కమీషన్‌లలో కేసులు వేయబోతున్నామని లాయర్ శ్రావణ్ కుమార్ ప్రకటించారు.
లాయర్ శ్రావణ్ కుమార్ సందించిన ఈ ప్రశ్నలు చాలా ఆలోచింపజేస్తున్నాయి. ఆయన జాతీయ స్థాయి కమీషన్‌లో పిర్యాదులు చేసినట్లయితే, అప్పుడు దిశ భూటకపు ఎన్‌కౌంటర్ కేసులో తెలంగాణ పోలీసులకు ఎటువంటి పరిస్థితి ఎదురయిందో, ఏపీ పోలీసులకు అటువంటి పరిస్థితే ఎదురవవచ్చు.



