వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై దాఖలైన అక్రమాస్తుల కేసుకు సంబంధించి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు బుధవారం నాడు సంచలన తీర్పు వెలువరించింది. అనంతపురం జిల్లాలోని లేపాక్షి నాలెడ్జ్ హబ్ వ్యవహారానికి సంబంధించి సీనియర్ ఐఏఎస్ అధికారి శ్యాంబాబుపై కొనసాగుతున్న విచారణను నిలుపుదల చేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇళంగో మధ్యంతర ఉత్వర్వులు జారీ చేసారు.
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన సమయంలో శ్యాంబాబు అనంతపురంలో లేపాక్షి నాలెడ్జ్ హబ్ కు పెద్ద ఎత్తున భూములు కేటాయించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన సీబీఐ చార్జిషీటు కూడా దాఖలు చేసి, నాంపల్లి కోర్టు ఆవరణలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ కొనసాగుతోంది. అయితే తనపై సీబీఐ తప్పుడు ఆరోపణలు చేస్తోందని హైకోర్టును ఆశ్రయించిన శ్యాంబాబు, తనపై జరుగుతున్న విచారణను నిలిపివేయాలని కోరారు.
అఖిల భారత సర్వీసులకు చెందిన తన క్లెయింట్ ను విచారించేందుకు కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి కూడా కావాలన్నారు. అయితే శ్యాంబాబును విచారించేందుకు అటు కేంద్రంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కూడా అనుమతివ్వలేదని, ఈ క్రమంలో విచారణ కొనసాగితే చట్టాలను దుర్వినియోగం చేయడమే అవుతుందని ప్రస్తావించారు. 2005-10 పారిశ్రామిక విధానం ప్రకారం అధికారులు నాలెడ్జ్ హబ్ తో మెమోరాండం ఆఫ్ అగ్రిమెంట్ చేసుకున్నారని, దానిని రాష్ట్ర కేబినెట్ కూడా ఆమోదించిందని తెలిపారు. ఈ వాదనతో ఏకీభవించిన జస్టిస్ శ్యాంబాబుపై జరుగుతున్న విచారణను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్వర్వులు జారీ చేశారు. ఇటీవలే కేంద్రం కూడా శ్యాంబాబుపై విచారణకు ‘నో’ అన్న విషయం తెలిసిందే.



