ఐదేళ్ళ జగన్ విధ్వంస పాలన చూసిన తర్వాత ఆయన నుంచి ఏం పాఠాలు నేర్చుకోవాలి?అనే సందేహం కలుగవచ్చు. ఒకరి గెలుపు నుంచే కాక ఓటమి నుంచి కూడా పాఠాలు నేర్చుకోవచ్చు. ఇందుకు జగన్, కేసీఆర్ కంటే గొప్ప సాక్షులు ఎవరుంటారు?
చంద్రబాబు నాయుడుని జగన్, ప్రధాని మోడీని కేసీఆర్ ఎంతగానో ద్వేషించేవారు. ఆ ద్వేషాన్నే వారు తమ పార్టీల ‘రాజకీయ విధానం’గా మార్చేసుకొని, అదే విధానంతో పార్టీని, ప్రభుత్వాన్ని నడిపించి చివరికి వారే బలైపోయారు.
జగన్ విషయానికే వస్తే ఆయన ద్వేషానికి అమరావతిని బలి చేశారు. ఆ ద్వేషాగ్నిలో ప్రజావేదిక, అన్నా క్యాంటీన్లు, అమరావతి, పోలవరం వరకు ప్రతీదీ ఆహుతయ్యాయి.
Also Read – అప్పుడు సంబరాలు..ఇపుడు సందేశాలు..!
ఆ ద్వేషంతోనే చంద్రబాబు నాయుడుని ఎలాగైనా అరెస్ట్ చేసి లోపలేయాలనే తాపత్రయంతో జగన్ గవర్నర్ ముందస్తు అనుమతి తీసుకోకుండా దూకుడుగా వ్యవహరించారు. తర్వాత చంద్రబాబు నాయుడి లాయర్లు సరిగ్గా అదే పాయింట్ లేవనెత్తి సుప్రీంకోర్టులో పోరాడి ఆయనని విడిపించుకున్నారు.
చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం వల్లనే ప్రజలు కూడబలుక్కున్నట్లు జగన్‌ని గద్దె దించేశారు కూడా. అంటే జగన్ ద్వేషానికి స్వయంగా ఆయనతో పాటు వైసీపీ కూడా బలైపోయిందన్న మాట!
ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత కూడా జగన్ తన ద్వేష విధానాన్ని మార్చుకోలేదు. కనుక ఆ విధానానికి వైసీపీ నేతలు మూల్యం చెల్లిస్తున్నారు. అంటే రాజకీయాలలో వ్యక్తిగత ద్వేషం హద్దులు దాటితే ఎవరికీ మంచిది కాదని జగన్ రుజువు చేశారన్న మాట.
Also Read – ‘తమిళ’ దర్శకులు ‘తెలుగు’ వారిని మెప్పించలేరా..?
జగన్ చేసిన ఈ తప్పుల నుంచి తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి చాలా నేర్చుకున్నట్లే ఉన్నారు. అందుకే ఎన్ని కేసులు సిద్దంగా ఉన్నా ఆయన కేసీఆర్ జోలికి పోవడం లేదు. కానీ ఆయనని మానసికంగా దెబ్బ తీసి బిఆర్ఎస్ పార్టీని రాజకీయంగా బలహీనపరిచేందుకు కేటీఆర్‌ని రౌండప్ చేశారని భావించవచ్చు.
చంద్రబాబు నాయుడు అరెస్టు విషయంలో జరిగిందంతా కళ్ళారా చూశారు కనుక రేవంత్ రెడ్డి ఏమాత్రం తొందర పడకుండా ముందుగా గవర్నర్ అనుమతి తీసుకున్నారు. గవర్నర్ అనుమతి అంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి లభించిన్నట్లే అని వేరే చెప్పక్కరలేదు.
Also Read – అమరావతి కష్టాలు భోగి మంటలో కాలినట్టేనా.?
ఆ తర్వాతే కేటీఆర్‌ని అరెస్ట్ చేసేందుకు ఏసీబీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఊహించిన్నట్లే ఆయన హైకోర్టుకి వెళ్ళి డిసెంబర్ 30 వరకు అరెస్ట్ కాకుండా బెయిల్ పొందగలిగారు. కానీ అరెస్ట్ కాకుండా తప్పించుకోలేరనే చెపొచ్చు.
రేవంత్ రెడ్డి నిర్ణయాలలో ద్వేషం పాళ్ళు తక్కువగా ఉన్నప్పటికీ తన నిర్ణయాలతో ఒక్కో వర్గాన్ని దూరం చేసుకుంటున్నారని చెప్పక తప్పదు.
హైడ్రాతో పేదలు, మద్యతరగతి ప్రజలను, అల్లు అర్జున్ విషయంలో సినీ పరిశ్రమని దూరం చేసుకున్నారు. ఇలా ఒక్కో నిర్ణయంతో ఒక్కో వర్గం దూరమైతే చివరికి నష్టపోయేది ఆయన, కాంగ్రెస్ పార్టీయే. కనుక రేవంత్ రెడ్డి కూడా ఆత్మవిమర్శ చేసుకొని ముందుకు సాగడం మంచిది.