లోక్‌సభ ఎన్నికలు: ప్రభుత్వ ఏర్పాటుకా… పడగొట్టడానికా?

BRS-BJP

దేశ ప్రజలు తమకు నచ్చిన పార్టీ లేదా కూటమితో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికే ప్రతీ 5 ఏళ్ళకు ఓ సారి లోక్‌సభ ఎన్నికలు జరుగుతుంటాయి. ఈసారి కూడా అలాగే జరుగుతున్నాయి. కానీ ఈసారి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు కంటే తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పడగొట్టడానికే అన్నట్లు ఆ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు జరగడం విశేషం.

లోక్‌సభ ఎన్నికల తర్వాత రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందని ఇటు కేసీఆర్‌, అటు బీజేపీ నేతలు ఇద్దరూ బెదిరిస్తూనే ఉన్నారు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని 5 నెలలు కాక ముందే ఎందుకు గద్దె దించేయాలంటే ఎన్నికలలో ఇచ్చిన హామీలు అమలుచేయలేదని కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్ రావులు వాదిస్తున్నారు.

ADVERTISEMENT

ఒకవేళ ఎన్నికల హామీలు అమలు చేయకపోతే, ఎందుకు చేయలేదని నిలదీసి ప్రశ్నిస్తుండాలి లేదా అమలు చేయమని ఒత్తిడి చేస్తుండాలి కానీ ప్రభుత్వం కూలద్రోయడం దేనికి?అంటే కేసీఆర్‌ అధికార దాహమే అని అర్దమవుతుంది.

అయితే పదేళ్ళు తెలంగాణని పాలించిన కేసీఆర్‌ అన్ని హామీలను అమలుచేశారా? అంటే దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగ భృతి, పంట రుణాల మాఫీ, పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు వంటి అనేక హామీలను అమలుచేయకుండా ఎగగొట్టి దిగిపోయారు. కానీ 5 నెలలు కూడా కాకమునుపే రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం 420 హామీలను అమలుచేసేయాలట. లేకుంటే గద్దె దించేస్తారట!

కేంద్రంలో సుస్థిరమైన, బలమైన ప్రభుత్వం ఏర్పడాలని ఎవరైనా కోరుకుంటారు. అప్పుడే దేశం నిలకడగా అభివృద్ధి చెందుతుంది. తమ పదేళ్ళ పాలనలో తెలంగాణలో అలాగే అభివృద్ధి చెందిందని కేసీఆర్‌ సగర్వంగా చెప్పుకుంటారు. అది నిజం కూడా.

కానీ కేంద్రంలో ఈసారి కాంగ్రెస్‌, బీజేపీలు రెండూ అధికారంలోకి రాలేవని తమ వంటి ప్రాంతీయ పార్టీలకే అవి మద్దతు ఇచ్చి ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించాల్సి ఉంటుందని కేసీఆర్‌ చెప్తున్నారు. అంటే కప్పల తక్కెడ వంటి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు కావాలని కోరుకుంటున్నారన్న మాట!

ఎందుకంటే ఈ ప్రపంచంలో అందరికంటే నేనే గొప్ప మేధావినిననే అహం కేసీఆర్‌లో ఉంది. కనుక లోక్‌సభ ఎన్నికల కేంద్రంలో హంగ్ ఏర్పడితే అప్పుడు తాను చక్రం తిప్పి ప్రధాని కుర్చీలో కూర్చోవాలని అనుకుంటున్నాని ఆయనే స్వయంగా చెప్పుకున్నారు.

ఈవిదంగా కేంద్రంలో, రాష్ట్రంలో, వీలైతే ఆంధ్రా రాజకీయాలను కూడా తానే శాశించాలని కేసీఆర్‌ అనుకోవడం ఆయన అహంకారానికి అద్దం పడుతోందని చెప్పవచ్చు.

ఇక బీజేపీ విషయానికి వస్తే, లోక్‌సభ ఎన్నికలలో గెలిచి మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి రావాలని అది చాలా తహతహలాడుతోంది. అదేమీ తప్పు కాదు. ప్రజలకు నచ్చితే మళ్ళీ తప్పకుండా అవకాశం ఇస్తారు. కానీ తెలంగాణలో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని, ఢిల్లీలో అర్వింద్ కేజ్రీవాల్‌ ప్రభుత్వాలను కూల్చేయాలనుకోవడం చాలా తప్పు.

ఇదివరకు నలుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి కేసీఆర్‌ ప్రభుత్వాన్ని కూల్చేయాలని ప్రయత్నించినప్పుడు, ఆయన తెలివిగా ముగ్గురు బి‌జేపీ ప్రతినిధులను వలపన్ని పట్టుకొని అరెస్ట్ చేసి జైల్లో వేశారు.

అయినా బీజేపీ తీరు మారలేదని ఆ పార్టీ తెలంగాణ నేతల మాటలు వింటే అర్దమవుతుంది. ఆగస్ట్ నెలలో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంలో సంక్షోభం ఏర్పడబోతోందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ బెదిరించడంమే ఇందుకు నిదర్శనం.

అంటే దేశ ప్రజలు బీజేపీని కేంద్రంలో అధికారం చేపట్టమని ఎన్నుకుంటే, ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని తెలంగాణ, ఇంకా బీజేపీ యేతర ప్రభుత్వాలను కూల్చేయాలనో లేదా జగన్‌ ప్రభుత్వంలాగా తన చెప్పు చేతల్లో ఉంచుకోవాలని అనుకుంటోందన్న మాట!

ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకొని దేశ, రాష్ట్రాభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన పార్టీలు… అవి నడిపించే ప్రభుత్వాలు ఈవిదంగా ఇతర ప్రభుత్వాలను కూల్చాలనుకోవడాన్ని ఏమనుకోవాలి?

ADVERTISEMENT
Latest Stories