ఎర్రడైరీతో లోకేష్‌ భయపెడుతున్నాడు… అయితే మరో కేసు వేసేయ్!

Lokesh-Nara-Red-Diary

రాజుగారు తలుచుకొంటే కొరడా దెబ్బలకు కరువేమిటన్నట్లు… ఏపీ సీఐడీ తలుచుకొంటే కేసులు పెట్టడానికి కారణాలు కరువవుతాయా? టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ బహిరంగ సభలో ఎర్రడైరీ చూపిస్తూ పోలీసులను, అధికారులను బెదిరిస్తున్నారంటూ ఏపీ సీఐడీ ఏసీబీ కోర్టులో నేడు మరో పిటిషన్ వేసింది.

అయితే దానిని ఇన్నర్ రింగ్ రోడ్ కేసుతో ముడిపెట్టడమే విచిత్రం. ఆ కేసులో నారా లోకేష్‌కి సెక్షన్ 41ఏ కింద నోటీస్ జారీ చేసి కేసు నమోదు చేసినందున, నారా లోకేష్‌ ఈవిదంగా ఎర్రడైరీ చూపిస్తూ అధికారులను బెదిరించడం సెక్షన్ 41ఏ నిబందనని ఉల్లంఘించడమే అవుతుంది కనుక నారా లోకేష్‌పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని ఏపీ సీఐడీ న్యాయవాది కోరారు. దీనిపై ఏసీబీ కోర్టులో ప్రస్తుతం విచారణ జరుగుతోంది.

ADVERTISEMENT

ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ముందస్తు బెయిల్‌ కోసం నారా లోకేష్‌ ఇదివరకే హైకోర్టుని ఆశ్రయించడంతో, న్యాయస్థానం ఆయనకు సెక్షన్ 41ఏ కింద నోటీస్ జారీ చేసి విచారణ జరుపుకొనేందుకు అనుమతిస్తూ అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది.

కానీ ఆయనను 41ఏ ఉల్లంఘిస్తే అరెస్ట్ చేయవద్దనే అధికారం న్యాయస్థానానికి ఉండదని ఏపీ సీఐడీ న్యాయవాది వాదిస్తున్నారు. కనుక నారా లోకేష్‌ మళ్ళీ హైకోర్టుని ఆశ్రయించి బెయిల్‌ పొందకుండా అడ్డుకొనేందుకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని ఏపీ సీఐడీ కోరుతోందన్న మాట!

ఇంతవరకు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లపై ఏపీ సీఐడీ నమోదు చేసిన ఏ ఒక్క కేసులో వారిని దోషులుగా నిరూపించలేకపోయింది. ఏపీ సీఐడీ ఎటువంటి బలమైన సాక్ష్యాధారాలు లేకుండానే కేవలం చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయాలనే ఉద్దేశ్యంతోనే కేసులు నమోదు చేస్తున్నట్లుందని హైకోర్టు మొట్టికాయలు కూడా వేసింది.

అయినా ఏపీ సీఐడీ మళ్ళీ నారా లోకేష్‌ని అరెస్ట్ చేసేందుకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని కోరుతూ పిటిషన్‌ వేయడం చూస్తే, టిడిపి నేతలని జైల్లో వేసేందుకు వైసీపి ప్రభుత్వం ఎంత ఆతృతగా ఉందో అర్దమవుతోంది.

కానీ చంద్రబాబు నాయుడు అరెస్టు వలన తాము అనుకొన్న ప్రయోజనాలు నెరవేరకపోగా, ఆయన ప్రతిష్ట మరింత పెరిగిందని, ప్రజలలో సానుభూతి పెరిగిందని, అది రాబోయే ఎన్నికలలో ఓట్ల రూపంలోకి మారితే టిడిపి లాభపడుతుందని వైసీపి ప్రభుత్వానికి తెలిసి ఉన్నా ఇంకా కేసులు, అరెస్టులు అంటోందంటే ఏమనుకోవాలి?

ADVERTISEMENT
Latest Stories