మహా కుంభమేళ: పుణ్య స్నానాల లెక్కలు మాత్రమే కాదు

mahakumbh_with_shiva-

యావత్ ప్రపంచంలో మరే దేశంలోనూ చూడలేని మహాద్భుతం మహా కుంభమేళ. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రయాగరాజ్ వద్ద త్రివేణీ సంగమంలో జనవరి 13 నుంచి మొదలై 45 రోజులుగా సాగుతున్న మహా కుంభమేళ నేటితో ముగియనుంది. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా అర్ధరాత్రి అమృత స్నానాలతో మహా కుంభమేళ ముగుస్తుంది.

ADVERTISEMENT

మహా కుంభమేళా మొదలైన రోజు నుంచి త్రివేణీ సంగమం వద్ద రాత్రి పగలు అనే తేడా లేకుండా 24 గంటలు భక్తులు పుణ్యస్నానాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు 63.6 కోట్ల మంది పుణ్యస్నానాలు చేశారు. అంటే దేశంలో దాదాపు సగం జనాభా మహా కుంభమేళకు తరలివెళ్ళారన్న మాట!

నేడు మహాశివరాత్రి పర్వదినం.. నేటితో మహా కుంభమేళ ముగుస్తుండటంతో దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు ప్రయాగ్‌రాజ్ చేరుకోవడంతో నగరం అంతా భక్తులతో కిటకిటలాడిపోతోంది.

ఇవాళ్ళ ఒక్కరోజే సుమారు రెండు కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేస్తారని మహా కుంభమేళ అధికారులు అంచనా వేస్తున్నారు. కానీ వారి అంచనాలకు మించి భక్తులు తరలివస్తున్నట్లు తెలుస్తోంది.

ఓ నగరానికి, ఓ నదీ తీరానికి 65 కోట్ల మంది ప్రజలు తరలివస్తే వారందరికీ తగిన ఏర్పాట్లు చేయడం, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు, తొక్కిసలాటలు జరుగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయడం, ముఖ్యంగా ఉగ్రదాడులు జరుగకుండా నిఘా ఉంచడం మామూలు విషయం కాదు. కానీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాధ్ సారధ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సాధ్యం చేసి చూపింది.

కొన్ని అవాంఛనీయ సంఘటనలు, అసౌకర్యాలు ఎదురైనప్పటికీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మహా కుంభమేళని చాలా సమర్ధంగా, విజయవంతంగా నిర్వహించిందని అక్కడకు వెళ్ళి వచ్చిన భక్తులే చెపుతున్నారు.

మహా కుంభమేళా అంటే కేవలం త్రివేణీ సంగమంలో పుణ్య స్నానాల లెక్కలు మాత్రమే కాదు. దేశంలో ఇన్ని కులమతాలు, భాషలు, భిన్న సంస్కృతులున్న భారతదేశంలో దాదాపు సగం జనాభా తరలివచ్చి పుణ్య స్నానాలు చేస్తుండటం చూసి మహా కుంభమేళకు వచ్చిన విదేశీయులు ఆశ్చర్యపోతున్నారు.

దేశంలో అనేక మతాలవారు ఉన్నప్పటికీ సనాతన ధర్మం ఎంత బలంగా ఉందో ప్రపంచదేశాలు గ్రహించగలిగాయి. ఈ ఒక్క మహా కుంభమేళతోనే భారత్‌లో భిన్నత్వంలో ఏకత్వం స్పూర్తిని యావత్ ప్రపంచదేశాలకు భారతీయులు మరోసారి చాటి చెప్పారు.

ADVERTISEMENT
Latest Stories