టాలీవుడ్ ప్రిన్స్ గా “రాజకుమారుడు” ద్వారా రంగప్రవేశం చేసిన మహేష్ బాబు, సూపర్ స్టార్ గా ఎదిగి “గుంటూరు కారం”తో ఇప్పటివరకు 28 సినిమాలను పూర్తి చేసారు. దాదాపుగా 25 ఏళ్ళ నుండి వింటున్న మహేష్ బాబు మాటలు ఎప్పుడూ ఒకే విధంగా ఉంటాయన్న సంగతి అభిమానులకు తెలిసిందే. ఏ సినీ వేదిక మీద కూడా పట్టుమని పది నిముషాలు కూడా ఎప్పుడూ ప్రసంగించరు, సమయాభావనలో “గుంటూరు కారం” సినీ వేదిక కూడా ఇందుకు మినహాయింపు ఏమీ కాదు.
కానీ ఈ సారి మహేష్ బాబు పలికిన పలుకులు అభిమానులను తీవ్ర ఉద్వేగానికి గురిచేశాయి, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే కంటతడి పెట్టించాయి. “ఎప్పుడూ చెప్పేదే ఇప్పుడు కూడా చెప్తాను … మీ ఆశీస్సులు, అభిమానం ఎప్పుడూ నాతో ఉండాలి, నా గుండెల్లో ఎప్పుడూ మీరు ఉంటారు, ఎప్పుడూ… ఎప్పుడూ… ఇలాంటి మీకు దండం పెట్టి నమస్కరించడం తప్ప, నేనేమి చేయలేను” అంటూ అభిమానులను ఉద్దేశించి ప్రారంభించిన మహేష్ స్వరం మారిపోయింది.
“బాక్సాఫీస్ రికార్డులు, కలెక్షన్ల గురించి నాన్న కృష్ణ గారు చెప్తుంటే ఎంతో ఆనందం వచ్చేదని, ఆ ఫోన్ కాల్ కోసమే తాను ఎదురు చూసేవాడినని, ఈ సినిమాలు ఇవన్నీ ఆయన కోసమే కదా” అంటూ ఉద్వేగానికి లోనయ్యారు మహేష్. “ఇప్పుడు ఆయన లేరు, అవన్నీ మీరే నాకు చెప్పాలి, ఇక నుండి అమ్మ అయినా మీరే, నాన్న అయినా మీరే, అన్నీ మీరే” అంటూ అభిమానులను ఉద్దేశించి చెప్తున్న సమయంలో మహేష్ కంఠ స్వరంలోని ఆర్ద్రత అభిమానులకు కళ్ళు చెమర్చేలా చేసింది.
“గుంటూరు కారం”లో తన నటన సరికొత్తగా ఉంటుందని చెప్పిన మహేష్ మాటల్లోని ఆంతర్యం తెలుసుకోవాలంటే మరో రెండు రోజులు గడవాలి గానీ, “గుంటూరు కారం” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాత్రం ఓ సరికొత్త మహేష్ ను అభిమానులు చూసారు. తండ్రి సూపర్ స్టార్ కృష్ణ, తల్లి నిర్మలాదేవిలు లేని లోటు మహేష్ లో పూర్తిగా కనపడుతుందని చెప్పడానికి ఈ వేదిక ఒక నిదర్శనంగా మారిందేమో!?
సహజంగా మహేష్ బాబు ఇచ్చే స్పీచ్ ల పైన తన సినీ వేదికల మీదే ట్రోలింగ్ జరుగుతుంది. హీరోయిన్ల గురించి, దర్శకుల గురించి, అలాగే సంగీత దర్శకులు, నిర్మాతల గురించి ఒకే రకమైన వ్యాఖ్యలు చేస్తారని ‘బాలయ్య – అన్ స్టాపబుల్’ వంటి కార్యక్రమాలలో కూడా నేరుగా వీడియోలు ప్రసారం చేసి మహేష్ నే అడుగగా, దానికి చిరునవ్వే సమాధానం అయ్యింది.
అలాంటి మహేష్ నేడు బాగా ఎమోషనల్ అయ్యారంటే, అభిమానులకు తానిచ్చే ప్రాధాన్యత ఏమిటో చెప్పదలుచుకున్నారేమో! లేక అశేష అభిమానులను చూసిన సమయంలో ఉద్వేగానికి లోనయ్యారేమో! ఏది ఏమైనా సినీ వేదికల మీద ఎప్పుడూ సెటిల్డ్ గా కనిపించే మహేష్ బాబు, నేడు మాత్రం చాలా ఉద్వేగభరితులై అభిమానుల హృదయాలను స్పృశించారనేది మాత్రం వాస్తవం.




