మెగాస్టార్ చిరంజీవి తర్వాత టాలీవుడ్ లో నెంబర్ 1 ఎవరూ అంటే మొదటగా గుర్తుకు వచ్చే పేరు ప్రిన్స్ మహేష్ బాబు. బరిలో చాలా మందే ఉన్నా… చిరంజీవి మాదిరి అన్ని వర్గాల ప్రేక్షకులను కట్టిపడేయ గల నటుడు ప్రిన్స్ కావడం… తన స్టామినా నిరూపించుకోవాల్సిన ప్రతి సమయంలో బ్లాక్ బస్టర్స్ ను అందివ్వడం… ప్రిన్స్ ను ఆ రేంజ్ లో నిలబెట్టింది. ఒక్క హిట్స్ విషయంలోనే కాదు, అభినయం పరంగా ఏ పాత్ర ఇచ్చినా అందులో అలవోకగా లీనమై, ఆ పాత్రకు వంద శాతం న్యాయం చేయడంలో దిట్ట ఈ సూపర్ స్టార్.
అందుకే ప్రేక్షకుల రివార్డులతో పాటు విమర్శకుల అవార్డులు కూడా ప్రిన్స్ పరమవుతుంటాయి. ఈ తరం నటులలో ఎవరికీ దక్కని రీతిలో ఎన్నో అవార్డులను తన ఇంట కొలువు చేసుకున్న మహేష్, తాజాగా మరో ఫిల్మ్ ఫేర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ‘శ్రీమంతుడు’ సినిమాకు గానూ మహేష్ అందుకున్న ఫిల్మ్ ఫేర్ అవార్డు, ప్రిన్స్ కెరీర్ లో అయిదవది. ఇప్పటివరకు అత్యధిక ఫిల్మ్ ఫేర్ లు అందుకున్న ఘనత మెగాస్టార్ చిరంజీవి సొంతం. 7 ఫిల్మ్ ఫేర్ అవార్డులతో టాలీవుడ్ హీరోలలో నెంబర్ 1 స్పాట్ ను కైవసం చేసుకున్నారు.
చిరు తర్వాత స్థానంలో విక్టరీ వెంకటేష్ 5, ప్రిన్స్ మహేష్ బాబు 5 ఫిల్మ్ ఫేర్ అవార్డులతో రెండవ స్థానంలో నిలిచారు. ప్రిన్స్ అభినయాన్ని పరిశీలిస్తుంటే, మరికొద్ది సంవత్సరాలలోనే మెగాస్టార్ ను వెనక్కి నెట్టడం ఖాయంగా కనపడుతోందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అయితే ఇదే సమయంలో మెగాస్టార్ కూడా మళ్ళీ రేసులో నిలవడానికి సినిమాలు చేస్తున్న వైనం తెలిసిందే. ఇక, వీరి తర్వాత అల్లు అర్జున్ 3, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ చెరొక ఫిల్మ్ ఫేర్లను తమ వెంట తీసుకువెళ్ళారు.



