గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న 45 సంవత్సరాల మలయాళ సినీ దర్శకుడు దిఫన్ చేతన్, కొచ్చిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. చేతన్ స్వస్థలం అయిన తిరువనంతపురంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం. యువ వయసులోనే చేతన్ మృతి చెందడంపై పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపం తెలిపారు.
నటుడు పృథ్వీరాజ్ తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా విచారం వ్యక్తం చేస్తూ… ఆయన దర్శకత్వంలో వచ్చిన పలు మంచి చిత్రాల్లో తనకు నటించే అవకాశం అభించిందన్నారు. అలాగే చేతన్ ను మిస్ అవుతున్నానంటూ హీరోయిన్ ప్రియమణి ఓ ఫోటోను పోస్ట్ చేసింది. అసిస్టెంట్ దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన దిఫన్ చేతన్, 2003లో ‘లీడర్ కింగ్ మేకర్’ అనే చిత్రం ద్వారా దర్శకుడిగా మారారు.
మొత్తం 7 సినిమాలకు దర్శకత్వం వహించిన చేతన్ కెరీర్ లో 2009 లో నటుడు పృథ్వీరాజ్ తో ‘పుతియా ముఖం’, 2012లో ‘హీరో’, ‘సిమ్’, 2014లో ‘డాల్ఫిన్ బార్’ చిత్రాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం చేతన్ తెరకెక్కిస్తున్న ‘సత్య’ సినిమా విడుదలకు నోచుకోవాల్సి ఉంది. ఇటీవలే భావన ఉదంతంతో మలయాళ చిత్ర పరిశ్రమ షాక్ కు గురవ్వగా, తాజాగా చేతన్ మరణంతో మరోసారి కృంగిపోయింది.



