వెంకన్న వరాలు: అన్ లిమిటెడ్ కావయ్యా మల్లారెడ్డీ!

Mallareddy Blames Congress for Telangana Decline

బీఆర్ఎస్‌ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే మల్లారెడ్డి నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాక బయట మీడియాతో మాట్లాడుతూ, “నేను కోరుకున్న ప్రతీ కోరికని వెంకన్న తీర్చాడు. నేను అడగకుండానే మంత్రి పదవి కూడా ఇచ్చాడు. కేసీఆర్‌ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నాను. ఆయన హయంలో తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధి చెందింది.

నాడు ఏపీలో భూములు అమ్ముకొని తెలంగాణలో కొనుక్కునేవారు. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతా రివర్స్ అయిపోయింది. తెలంగాణలో రియల్ ఎస్టేట్ పడిపోయింది. రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు రావడం లేదు. అన్ని రంగాలలో తెలంగాణ రాష్ట్రం తిరోగమిస్తోంది. నాడు ఏపీలో ఎటువంటి దయనీయ పరిస్థితి ఉండేదో నేడు తెలంగాణలో అలా ఉంది.

ADVERTISEMENT

ఇప్పడు సిఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతోంది. ఇప్పుడు తెలంగాణలో భూములు అమ్ముకొని ఏపీలో కొనుకుంటున్నారు. ప్రధాని మోడీ కూడా దేశాన్ని అన్ని రంగాలలో శరవేగంగా అభివృద్ధి చేస్తున్నారు.

నాడు కేటీఆర్‌ తెలంగాణకి లక్షల కోట్ల పెట్టుబడులు, పరిశ్రమలు తేగా ఇప్పుడు సిఎం చంద్రబాబు నాయుడు ఏపీకి తీసుకువస్తున్నారు.

ఇప్పుడు ఏపీ అభివృద్ధి చెందుతుంటే తెలంగాణ పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. కనుక మళ్ళీ కేసీఆర్‌ ముఖ్యమంత్రి కావాలని ఏడుకొండల వెంకన్నని కోరుకున్నాను,” అని మల్లారెడ్డి అన్నారు.

కేసీఆర్‌ యజ్ఞాలు, యాగాలు చాలా చేశారు. కానీ భక్తితో కాదు! తనకి, తన కుటుంబానికి, తన పార్టీకి ఎదురే ఉండకూడదని కోరుకుంటూ చేశారు.

అలాగని గాలిలో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అనుకోలేదు. తన రాజకీయ ప్రత్యర్ధులను ఉక్కుపాదంతో అణచివేశారు కూడా. చిత్తశుద్ధి లేని అయన పూజలు, యజ్ఞయాగాలు ఫలించకపోగా వికటించాయి కూడా!

కనుక మానవ ప్రయత్నాలు, ఆలోచనలు సక్రమంగా ఉండి చిత్తశుద్ధితో చేసిన పూజలే ఫలిస్తాయి తప్ప ఎవరికీ ‘అన్ లిమిటెడ్ ఆఫర్లు’ ఉండవు.

కానీ కేసీఆర్‌, బీఆర్ఎస్‌ పార్టీ రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరంగా కనిపిస్తోంది కనుక ఓసారి ఏడుకొండలవాడిని రిక్వెస్ట్ చేయడంలో తప్పులేదు.

ADVERTISEMENT
Latest Stories