గత కొద్దీ రోజులుగా మంచు కుటుంబంలో జరుగుతున్న వివాదాలు చిలికిచిలికి దాడులుగా మారి ఆ పై పొలిటికల్ టర్న్ తీసుకుంది. మంచు మోహన్ బాబు, ఆయన పెద్ద కుమారుడు మంచు విష్ణు ఒక జట్టుగా మంచు మనోజ్ మరో వైపుగా సాగుతున్న ఈ కుటుంబ వివాదం ఇప్పుడు రాజకీయ రంగు పూసుకోబోతుంది.
మంచు మనోజ్ తన భార్య మౌనిక తో కలిసి నేడు జనసేన పార్టీలో చేరుతున్నారంటూ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మౌనిక తల్లి భూమా శోభా రెడ్డి తండ్రి భూమా నాగిరెడ్డి ఇద్దరు కూడా రాజకియ నేపథ్యం ఉన్న నేతలే కావడం, వారి మరణంతో మౌనిక అక్క భూమా అఖిల ప్రియా కూడా రాజకీయ ఎంట్రీ ఇవ్వడంతో మౌనిక కు రాజకీయాలు కొత్తేమి కాకపోవచ్చు.
అయితే తన తల్లితండ్రుల మరణానంతరం మౌనిక రాజకీయంగా ఎటువంటి ముందడుగు వేయలేదు. అలాగే ఇటు మంచు మోహన్ బాబు కూడా ఒకప్పుడు టీడీపీ జెండా పట్టుకున్నారు, ఆ తరువాత వైసీపీ కండువా కప్పుకున్నారు. అయితే నేడు ఆళ్లగడ్డలో జరగనున్న భూమా నాగిరెడ్డి జయంతి వేడుకల తదనంతరం ఈ మంచు మనోజ్ జంట మంగళగిరి జనసేన పార్టీ ఆఫీసు లో జనసేన తీర్ధం పుచ్చుకోబుతున్నట్టు సమాచారం.
అయితే ఇప్పటికే మౌనిక అక్క భూమా అఖిల ప్రియా తన తల్లితండ్రుల రాజకీయ వారసత్వాన్ని నిలబెడుతూ టీడీపీ పార్టీ తరుపున నంద్యాల జిల్లా ఆళ్లగడ్ఢ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ నేపథ్యంలో చెల్లి మౌనిక తన భర్త మంచు మనోజ్ తో కలిసి టీడీపీ మిత్ర పక్షమైన జనసేన కండువా కప్పుకోనున్నారు అంటూ పెద్ద ఎత్తున పుకార్లు షురూ అయ్యాయి.
గతంలో మా ఎన్నికల సందర్భంగా మంచు మోహన్ బాబు, మంచు విష్ణు తమ ప్రత్యర్థి వర్గం సభ్యుల మీద ప్రవర్తించిన తీరు పలు విమర్శలు తెచ్చిపెట్టాయి. ఆ నేపథ్యంలో వారు పవన్ కళ్యాణ్ అన్న నాగబాబు మీద కూడా పలు విమర్శలు చేసారు. అయినప్పటికీ ఆ సమయంలో మంచు మనోజ్ వ్యక్తిగతంగా పవన్ ను కలిసి కాసేపు ముచ్చటించారు. అలాగే మంచు మనోజ్ పట్ల సినీ ఇండస్ట్రీలో కూడా అందరికి సదాభిప్రాయమే ఉంటుంది.
తండ్రి మోహన్ బాబు, అన్న విష్ణు మాదిరి ఇతరులను కించపరుస్తూ నోరు పారేసుకోరు, అలాగే ఇతరులను దండిస్తూ చేయి పారేసుకోను మనోజ్. అటువంటి మనోజ్ సొంత కుటుంబ సభ్యులతో వైరం పెట్టుకుని మంచు ఫ్యామిలీకి గిట్టని మెగా కుటుంబ సభ్యుడైన జనసేన అధినేత పవన్ చెంతకు చేరడం తన తండ్రి మోహన్ బాబుకి, తన అన్న విష్ణుకి కాస్త విస్మయం కలిగించే అంశమే అవుతుంది.




