మోడీపై నిప్పులు చెరిగిన మన్మోహన్!

manmohan singh-narendra modiప్రధానిగా ఉన్న కాలమంతా ‘మౌనముని’గా పేరు తెచ్చుకున్న మన్మోహన్ సింగ్ తొలిసారిగా ‘గళం’ విప్పారు. ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే ఈ మాజీ ప్రధానికి కోపం తెప్పించిన ఘనతను మోడీ సొంతం చేసుకున్నారు. దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారని మోడీ సర్కారుపై ఆయన నిప్పులు చెరిగారు. జమ్మూ కాశ్మీర్ కే పరిమితమైన ఉగ్రవాద కార్యకలాపాలు ఇప్పుడు పంజాబ్ వంటి రాష్ట్రాలకు కూడా విస్తరించడానికి ప్రభుత్వ తీరే కారణమని దుయ్యబట్టారు.

“పాకిస్థాన్ పట్ల మోడీ వైఖరి సిగ్గు చేటు, ఉగ్రవాదులు దేశంలో స్వేచ్ఛగా సంచరిస్తున్నారు, తమ కార్యకలాపాలు విస్తరిస్తున్నారు. ఉగ్రవాదం పట్ల భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం లేదని చెప్పేందుకు ఇటీవలి పఠాన్ కోట్ దాడులే నిదర్శనం” అంటూ మండిపడ్డ మన్మోహన్, గడచిన రెండేళ్లలో వ్యవసాయం కుంటుపడిందని, రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని, మోడీ మాత్రం తానేదో సాధించినట్టు గొప్పలు చెప్పుకుంటున్నారని బిజెపి సర్కార్ తీరును ఎండగట్టారు.

ADVERTISEMENT

లోక్ సభ ఎన్నికలకు ముందు భారతీయులు విదేశాల్లో దాచుకున్న నల్లధనాన్ని వెనక్కి తెప్పిస్తామని ప్రగల్భాలు పలికారని, ఇప్పుడు దాని ఊసే ఎత్తడం లేదని… అసోంలో జరిగిన కాంగ్రెస్ ర్యాలీలో మోడీని, బిజెపి ప్రభుత్వ విధానాలను ఏకరువు పెట్టే ప్రయత్నం చేసారు. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో ఆర్ధిక సంస్కరణలు చేసిన వ్యక్తిగా మన్మోహన్ వ్యాఖ్యలకు ఎప్పుడూ ఒక విలువ ఉంటుంది. అలాంటి మన్మోహన్ రెండేళ్ళ పాటు సాగిన మోడీ పాలనపై విమర్శల పాలు చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

ADVERTISEMENT
Latest Stories