“వైనాట్ 175 సీట్స్?” “వైనాట్ కుప్పం సీట్?” అంటూ ధీమా వ్యక్తం చేస్తున్న సిఎం జగన్మోహన్ రెడ్డికి ఆయన కంచుకోట కడప జిల్లాలో వైసీపీ నేతలే షాక్ ఇవ్వబోతున్నారు.
రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డి సోదరుడు మేడ విజయ్ శేఖర్ రెడ్డి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని కలిసి పార్టీలో చేరాలనుకొంటున్నట్లు చెప్పారు. అందుకు చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించిన్నట్లు తెలుస్తోంది. అయితే విజయ్ శేఖర్ రెడ్డి ఒక్కరే టిడిపిలో చేరబోతున్నారా లేక ఆయన సోదరుడు మల్లికార్జున రెడ్డి కూడా చేరుతున్నారా?అనే విషయం ఇంకా తెలియవలసి ఉంది.
గడప గడపకి కార్యక్రమంపై సిఎం జగన్మోహన్ రెడ్డి సమీక్షా సమావేశంలో 18 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని, కనుక వెంటనే పనితీరు మెరుగు పరుచుకోవాలని, వారికిదే చివరి అవకాశం అని హెచ్చరించారు. ఆ 18 మంది ఎమ్మెల్యేలలో రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డి కూడా ఒకరని సమాచారం. బహుశః అందుకే ఆయన ముందుగా సోదరుడు విజయ్ శేఖర్ రెడ్డిని చంద్రబాబు నాయుడు వద్దకు పంపి ఉండవచ్చని వైసీపీ గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇటీవల నారా లోకేష్ కడప జిల్లాలో యువగళం పాదయాత్ర చేసిన తర్వాతే ఈ పరిణామం జరగడం గమనిస్తే, కడప జిల్లాకు చెందిన మరికొందరు వైసీపీ నేతలు టిడిపిలో చేరే అవకాశం ఉందనిపిస్తుంది.
వైసీపీలో నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు టికెట్స్ పంచాయితీ ఎప్పటి నుంచో సాగుతోంది. నెల్లూరులో అనిల్ కుమార్ యాదవ్- రూప్ కుమార్ యాదవ్, రామచంద్రాపురంలో పిల్లి శుభాష్ చంద్రబోస్-మంత్రి వేణుగోపాల కృష్ణ, గన్నవరంలో సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ-యార్లగడ్డ వెంకట్రావు ఇలా చెప్పుకొంటూ పోతే చాలా పెద్ద జాబితాయే ఉంది. విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు పంచకర్ల రమేశ్ బాబు పెందుర్తి టికెట్ లభించదని భావించి నిన్ననే పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిపోయారు.
అయితే ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున, వైసీపీలో అసంతృప్తిగా ఉన్న నేతలు జగన్‌ను అంటిపెట్టుకొని ఉన్నారు. ఎన్నికల గంట మ్రోగితే వైసీపీలో నుంచి ఎంత మంది బయటకు వస్తారో తేలిపోతుంది. కడప కంచుకోట నుంచి ఎంతమంది బయటకు వస్తారనేది కీలకం కానుంది.



