బాధ్యతలు కలిగిన వ్యక్తులు బహిరంగ వేదికల మీద మాట్లాడేటప్పుడు కాస్త సంయమనం వహించడం అవసరం. ఒకవేళ ఆ పరిధి దాటితే మాత్రం విమర్శలను చవిచూడాల్సి వస్తుంది. ఇందుకు నిదర్శనం… నాడు రామ్ చరణ్ చేసిన ‘వెంట్రుక’ డైలాగ్స్, అలాగే ఇటీవల జగన్ మోహన్ రెడ్డి చేసిన ‘వాళ్ళు నా వెంట్రుక కూడా పీకలేరు’ అన్న డైలాగ్స్.
ముందుగా వస్తే… రామ్ చరణ్ పలికిన ‘వెంట్రుక’ డైలాగ్. “నాయక్” సినిమా వేదిక మీద పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరైన సమయంలో చేసిన వ్యాఖ్యలివి. అప్పట్లో మెగా కుటుంబంలో కలహాలు చెలరేగాయని, అందుకే పవన్ కళ్యాణ్ ఏ మెగా హీరో సినీ వేదికలకు హాజరు కావడం లేదని పుకార్లు షికార్లు చేస్తున్న రోజులు.
వాటికి బదులిచ్చే క్రమంలో రామ్ చరణ్ సంయమనం కోల్పోయి ‘వెంట్రుక’ చూపిస్తూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు చేసే సమయానికి చరణ్ వయసు 28. అంటే పరిణితి పూర్తిగా రాని వయసు. యువ రక్తం ఉరకలేసే సమయం. సహజంగా అందుకు తగ్గట్లుగానే ముందు, వెనుక ఆలోచించకుండా నాడు ఆ వ్యాఖ్యలు చేసారు.
ఈ వ్యాఖ్యల తర్వాత చరణ్ పై మీడియా వర్గాలన్నీ దుమ్మెత్తిపోశాయి. రామ్ చరణ్ చేసిన ‘వెంట్రుక’ వ్యాఖ్యలపై బిగ్ డిబేట్ లు నిర్వహించడం ప్రధాన మీడియా ఛానెల్స్ వంతయ్యింది. అయితే తన తప్పు తెలుసుకున్న రామ్ చరణ్ అప్పటినుండి ఇప్పటివరకు మరో ‘మాట’ జారలేదు. పరిపక్వత కలిగిన వ్యక్తిగా తనను తాను ఆవిష్కృతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక వర్తమానానికి వస్తే, ఇటీవల జగన్ చేసిన ‘వాళ్ళు నా వెంట్రుక కూడా పీకలేరు’ మాటలు పెద్ద దుమారమే రేపాయి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సిన జగన్, ఏ మాత్రం సంయమనం లేకుండా చేసిన వ్యాఖ్యలపై మీడియా పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడం విశేషం. బహుశా ప్రముఖ మీడియా సంస్థలన్నీ అధికార పార్టీ చేతిలో ఉండడం ప్రధాన కారణం కావచ్చు.
సినీ ఫక్కీలో జగన్ మోహన్ రెడ్డి తన కార్యకర్తలను ఉద్వేగభరితులను చేయడానికి ఉపయోగపడే వ్యాఖ్యలు తప్ప, రాష్ట్రానికి గానీ, రాష్ట్ర ప్రయోజనానికి గానీ ఏ మాత్రం పొంతన లేని వ్యాఖ్యలివి. రాజకీయంగా ప్రత్యర్థి మీడియా సంస్థలు మాత్రం వీటిని ఖండించాయి గానీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఈ రెచ్చగొట్టుడు వ్యాఖ్యలను ప్రజల్లోకి తప్పుగా తీసుకెళ్లలేకపోయాయి.
ఈ వ్యాఖ్యలు చేసే సమయానికి జగన్ వయసు 49. అంటే పూర్తి పరిపక్వతతో మాట్లాడాల్సిన వయసులో కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యానించడం అనేది, రాజకీయ లబ్ది కోసం ఇంతగా దిగజారాల్సిన అవసరం ఉంటుందా? అన్న ప్రశ్న తలెత్తక మానదు. నిర్మాణాత్మక విమర్శలు చేయాల్సిన ప్రజా ప్రతినిధులు, ముఖ్యమంత్రులు ఇలా దిగజారి మాట్లాడితే, ఇక రాష్ట్ర ప్రజలకు ఎలాంటి సందేశాలు ఇస్తున్నారో వారే అర్ధం చేసుకోవాలి.
ఒక సినీ హీరోగా అనేక డైలాగ్స్ పలకడం రామ్ చరణ్ కు అలవాటు. అందులో భాగంగా ఏదో ‘టంగ్ స్లిప్’ అయ్యి, ఇలాంటి డైలాగ్స్ పలికారని సంజాయిషీ ఇచ్చుకోవచ్చు. అయినప్పటికీ ఆ రోజు మీడియా వర్గాలు ఊరుకోలేదు. ఒక సాధారణ సినీ హీరో చేసిన వ్యాఖ్యలపై అంత చర్చ చేపట్టి రచ్చ చేసిన మీడియా వర్గాలు, ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సిన ముఖ్యమంత్రి, కొన్ని కోట్ల మందికి ప్రతినిధిగా ఉన్న వ్యక్తి నోరు జారితే మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం అనేది అధికార బలానికి అద్దం పట్టే విషయంగా అర్ధం చేసుకోవాలేమో?!



